ఎన్నడూ లేనిది రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలా?

ఎన్నడూ లేనిది రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలా?
  • కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌‌ను ప్రశ్నించిన హరీశ్ రావు
  •  ఎన్నడూ లేనిది రేషన్ షాపుల్లో ప్రధాని ఫొటోలా?
  •  నిర్మల రాష్ట్ర ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

తూప్రాన్, వెలుగు: రేషన్ షాపుల్లో ప్రధాని మోడీ ఫొటో పెట్టాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పడం హాస్యాస్పదం అని మంత్రి హరీశ్ రావు అన్నారు. దేశంలో ఎంతో మంది ప్రధానులు అయ్యారు కానీ రేషన్ షాపుల్లో ఫొటోలు పెట్టలేదన్నారు. స్థాయిని దిగజార్చుకునేలా కేంద్ర మంత్రులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. శుక్రవారం మెదక్​జిల్లా తూప్రాన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. “దేశాన్ని సాదే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ నుంచి రూ.లక్షా 70 వేల కోట్లు అదనంగా కేంద్రానికి ఇచ్చాం. చాలా రాష్ట్రాలు పేద రాష్ట్రాలు. తెలంగాణ నుంచి ఇచ్చిన డబ్బులు ఇతర రాష్ట్రాలకు, కేంద్రానికి వెళ్తుంది. మరి కేంద్రంలో, ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ ఫొటో పెడతారా” అని ప్రశ్నించారు.

ఒక్కో కేంద్ర మంత్రి ఒక్కో మాట

కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు తలోరకంగా మాట్లాడుతున్నారని హరీశ్​రావు ఎద్దేవా చేశారు. ‘‘కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టుతో ఒక్క ఎకరా కూడా పారలేదన్నారు. మరో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కాళేశ్వరం తెలంగాణ గ్రోత్ ఇంజన్ అని అన్నారు. మేమే అనుమతులు ఇచ్చినం అని ఇంకో కేంద్ర మంత్రి అంటారు. మీ మాటలు విని ప్రజలు ఏమనుకోవాలి” అని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో ఎన్ని ఎకరాలకు కాళేశ్వరం నీళ్లు అందాయో అక్కడి రైతులకు తెలుసన్నారు. ‘‘తెలంగాణ ఆయుష్మాన్ భారత్ లో చేరలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ స్కీంలో రాష్ట్రం చేరలేదని నిరూపిస్తే నేను రాజీనామా చేస్త.. లేదంటే మీరు చేస్తరా” అని హరీశ్ సవాల్ విసిరారు. ఆయుష్మాన్ భారత్ లో తెలంగాణ 2018 మే నెలలో చేరిందని లోక్ సభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రే చెప్పారన్నారు. మరో కేంద్ర మంత్రి మాత్రం చేరలేదని ఇప్పుడు పచ్చిఅబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. 2021లో కేంద్రం ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రానికి రూ.150 కోట్లు మంజూరు చేసిందన్నారు. చేరకపోతే ఆ డబ్బులు ఎందుకిచ్చారని ప్రశ్నించారు. ఆమె తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పి తమ గౌరవాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

మీరే అప్పులు తీసుకోమన్నరు కదా?

రాష్ట్ర అప్పులు బాగా పెరిగాయని, ఒక్కో పౌరుడిపై లక్షా 20 వేల రూపాయల అప్పు ఉందని నిర్మల అబద్ధాలు చెప్పారని హరీశ్ అన్నారు. కరోనా వచ్చి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకూడదని అప్పులు తీసుకొమ్మని చెప్పింది మీరే కదా అని ప్రశ్నించారు. మాది కొత్త రాష్ట్రం కనుక నీళ్ల కోసం అప్పులు తెచ్చి ప్రాజెక్టులు కట్టామన్నారు. బంగారం లాంటి పంటలు పండిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని నిర్మల అన్నారని, కానీ 2014లో తెలంగాణలో 898 మంది రైతులు చనిపోతే, 2020లో 466 మంది చనిపోయారని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పార్లమెంట్ లో చెప్పారని హరీశ్​ అన్నారు.