
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్నే నిలుపుకోలేకపోయారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ ఓడిపోయిందని గుర్తు చేశారు. కరీంనగర్ బహిరంగ సభలో జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను హరీశ్ రావు ఖండించారు. తెలంగాణ ప్రభుత్వంపై నడ్డా చేసిన విమర్శల్లో వాస్తవికత లేదని.. ఆయన మాట్లాడిన దాంట్లో రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే విషయం ఒక్కటి కూడా లేదన్నారు. ఇప్పటికైనా నడ్డాకు జ్ఞానోదయం కావాలన్నారు. విలేకరుల సమావేశంలో మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘కేంద్ర ప్రభుత్వం మునుగోడులో ఫ్లోరోసిస్ రిసెర్చ్ సెంటర్ పెడ్తమన్నది.. ప్రత్యేక ఆస్పత్రి కట్టిస్తమన్నది.. ఇంకెప్పుడు కడ్తరు.. అక్కడి శిలాఫలకాలు మిమ్మల్ని వెక్కిరిస్తున్నయ్’’ అని ఆయన కామెంట్ చేశారు. ‘‘ తెలంగాణకు కేంద్రం నెలకో అవార్డు ఇస్తోంది.. ఢిల్లీలో అవార్డులు ఇస్తరు.. గల్లీలోనేమో తిడ్తరు’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘ రాష్ట్రంలో డెలివరీలలో 66 శాతం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి.. గతంలో ఇది కేవలం 30 శాతమే. వైద్యసేవలు రాష్ట్రంలో మెరుగుపడ్డయి. కేరళ, మహారాష్ట్ర తర్వాత తెలంగాణ మూడో స్థానంలో ఉంది’’ అని చెప్పారు. ‘‘ సెప్టెంబర్ 17ని అధికారికంగా చేసినం. స్వయంగా సీఎం కేసీఆరే ఆ కార్యక్రమంలో పాల్గొన్నరు. జేపీ నడ్డా అప్ డేట్ కావాలి. తెలంగాణలో ఏమేం జరుగుతోందో తెలుసుకోవాలి’’ అని హరీశ్ రావు సూచించారు.