- సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపణ
ఎల్బీనగర్, వెలుగు : రంగారెడ్డి జిల్లా కోహెడలోని పండ్ల మార్కెట్‌కు సంబంధించిన భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డితో కలిసి సోమవారం కోహెడ స్థలాన్ని పరిశీలించారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ... రూ.3 వేల కోట్ల విలువైన సుమారు 200 ఎకరాల మార్కెట్ భూమిని దళారులకు ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని, దీనిని నిరసిస్తూ రైతుల కోసం ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.
కోహెడ భూముల సమస్య బీఆర్ఎస్ పార్టీదో.. కాంగ్రెస్ పార్టీదో కాదని, రైతుల సమస్య అన్నారు. ఏ ప్రభుత్వమైనా రైతుల కోసం పనిచేయాలి కానీ... దళారుల కోసం కాదన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కోహెడలో ఫ్రూట్ మార్కెట్ నిర్మించేందుకు బీఆర్‌ఎస్ హయాంలో 2020 సంవత్సరంలో జీవో 11 ద్వారా నోటిఫై చేశామని గుర్తు చేశారు. వందేండ్లను దృష్టిలో పెట్టుకొని మార్కెట్‌కు రూపకల్పన చేశామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మార్కెట్‌ను పట్టించుకోకపోవడమే కాకుండా.. ఇప్పుడు భూమిని తమ వాళ్లకు కట్టబెట్టేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డికి భూముల మీద కన్ను పడిందని, ఎక్కడ భూములు ఉన్నా అమ్మేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. రైతుల భూములు నిషేధిత జాబితాలో చేర్చి వారిని ఇబ్బంది పెట్టొద్దన్నారు. కోహెడలో మార్కెట్ నిర్మించకపోతే రైతుల పక్షాన ఎంతవరకైనా కొట్లాడుతామని స్పష్టం చేశారు.
