దేశంలోనే ఎక్కువ జీతాలిస్తున్నం

దేశంలోనే ఎక్కువ జీతాలిస్తున్నం

మాది ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్:  హరీశ్​రావు
హుజూరాబాద్​ వెలుగు: దేశంలోకెల్లా ఎక్కువ వేతనాలు పొందుతున్న ఉద్యోగులు తెలంగాణలోనే ఉన్నారని మంత్రి హరీశ్​రావు అన్నారు.  టీచర్లకు అతితక్కువ వేతనాలు గుజరాత్​లో ఉంటే, మన రాష్ట్రంలో టీచర్లు ఎక్కువ వేతనాలు పొందుతున్నారని, తమది ఎంప్లాయ్​ ఫ్రెండ్లీ గవర్నమెంట్​ కావడమే ఇందుకు కారణమని చెప్పారు. హుజూరాబాద్​లో ఆదివారం పీఆర్టీయూ  టీఎస్​ కరీంనగర్​ జిల్లా అధ్యక్షుడు ఆదర్శన్​ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కృతజ్ఞత సమావేశంలో హరీశ్​రావు మాట్లాడారు. టీచర్లు, ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 30 % పీఆర్సీ  ప్రకటించామన్నారు. కేంద్రం పదేండ్లకోసారి పే రివిజన్ చేస్తే, మన రాష్ట్రంలో ఐదేండ్లకోసారి జరుగుతోందని చెప్పారు. గతంలో  42% అడిగితే 43 % పీఆర్సీ ఇచ్చిన సీఎం.. ఈసారి ఉద్యోగులు 15% ఆశిస్తే 30% ఇచ్చారన్నారు. తెలంగాణ వచ్చినప్పుడు మన రాష్ట్ర జీఎస్​డీపీ 5 లక్షల 54 వేల కోట్లు ఉంటే, ఇప్పుడు  9 లక్షల 84 వేల కోట్లకు పెరిగిందన్నారు. ఏడేండ్లలో 93.5 శాతం వృద్ధి సాదించామని తెలిపారు. బీజేపీ పాలనలో సబ్సిడీలు తగ్గించి గ్యాస్ ధర పెంచారని, పెట్రోలు, డీజిల్ భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ లో కూడా ఐటీ పార్క్ వస్తుందని, ఇందుకోసం కేసీఆర్ ను బలపరచాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ప్రమోషన్లు, బదిలీలు పూర్తయితే 55 వేల నుంచి 60 వేల ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. 
మాకు ప్రమోషన్లేవి?:
అంగన్​వాడీలు 
హుజూరాబాద్ సెంట్రల్​ ఫంక్షన్​ హాల్​లో  టీఎన్​జీవోస్​ ఆధ్వర్యంలో జరిగిన అంగన్​వాడీ కృతజ్ఞత సభలోనూ హరీశ్​రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్​వాడీల సంఘం హుజూరాబాద్​ అధ్యక్షురాలు ఉష నుంచి మంత్రికి చుక్కెదురైంది. తాము పదేండ్లుగా పనిచేస్తున్నప్పటికీ ఎలాంటి ప్రమోషన్లు లేవని, ఇదే పోస్టుల్లో రిటైర్​ అవుతామేమోననే ఆందోళన ఉందన్నారు. తాము అంగన్​వాడీలుగా  పనిచేస్తున్న పాపానికి  తమ కుటుంబాల్లోని వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదని ఉష ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేండ్లుగా తమకు టీఏ, డీఏ ఇవ్వడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు ఎందుకూ పనికి రావడం లేదని, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. మొదటి వారంలో జీతం చూడక చాలా రోజులైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కొంత మంది సంక్షేమ పథకాలను  పరిగె ఏరుకోవడమని, ఆసరా దండగ అని , రైతు బంధు కడుపు నిండదంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని  హరీశ్​రావు దుయ్యబట్టారు. అంగన్ వాడీ టీచర్లకు సూపర్ వైజర్లుగా పదోన్నతులు పొందేలా,  జీతాలు నెల మొదటి వారంలో వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.