రైతులకు కాంగ్రెస్​పై నమ్మకం లేదు : హరీశ్​రావు

రైతులకు కాంగ్రెస్​పై నమ్మకం లేదు : హరీశ్​రావు
  •     అందుకే యాసంగి సాగు విస్తీర్ణం తగ్గుతోంది : హరీశ్​రావు 

గజ్వేల్, వెలుగు: యాసంగి పంటకు రాష్ట్ర ప్రభుత్వం కరెంటు, నీళ్లు ఇస్తదో.. లేదోనన్న అనుమానంతో రైతులు సాగు చేయడానికి వెనకాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. కాంగ్రెస్​ నేతలు తమ గవర్నమెంట్ రాగానే డిసెంబర్ 9న రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారని, కానీ ఇంత వరకు చేయలేదని విమర్శించారు. రైతుబంధు, నిరుద్యోగ భృతి, రూ.4 వేల పింఛన్, ఉచిత విద్యుత్ ఏదీ లేదని ఆరోపించారు.

గురువారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్​టౌన్​లో నియోజకవర్గ కార్యకర్తల కృతజ్ఞత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గజ్వేల్ లో 47 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతోనే బీఆర్ఎస్ కు మెజార్టీ తగ్గిందన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా45 వేల మెజార్టీతో కేసీఆర్ ను గెలిపించినందుకు ఆయన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్నప్పుడు గజ్వేల్ లో ఏ పార్టీ వారిపై కేసులు పెట్టించలేదని.. కానీ కాంగ్రెస్​ అధికారంలోకి రాగానే బీఆర్ఎస్​ కార్యకర్తలపై కేసులు పెట్టించడం మొదలెట్టిందని మండిపడ్డారు. కేటీఆర్​దావోస్ వెళ్తే డబ్బులు దండగని అన్నారని, ఇప్పుడు మీరెందుకు వెళ్లారో చెప్పాలని హరీశ్​డిమాండ్ చేశారు.

బండి సంజయ్, రఘునందన్ రావు, అర్వింద్, బాపురావు, ఈటల రాజేందర్ తదితర బీజేపీ నాయకులను బీఆర్​ఎస్​ పార్టీయే ఓడించిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్​ కార్యకర్తలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని, ఏ కార్యకర్తకు ఇబ్బందివచ్చినా, కేసులైనా తనకు ఫోన్ చేయవచ్చన్నారు. కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు వదిలి చెరువులు నింపాలని హరీశ్​ రావు డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్​ప్రతాప్​రెడ్డి, సిద్దిపేట, మెదక్​ జడ్పీ చైర్​పర్సన్లు రోజాశర్మ, హేమలతగౌడ్​, జీపీపీ చైర్మన్ రాజమౌళిగుప్తా, మాజీ ఏఎంసీ చైర్మన్​ శ్రీనివాస్​పాల్గొన్నారు.