క్షుద్ర పూజలని మాట్లాడితే కోర్టుకీడుస్త..ఈ విషయంలో ఎంతటోళ్లైనా వదిలిపెట్ట : హరీశ్రావు

క్షుద్ర పూజలని మాట్లాడితే కోర్టుకీడుస్త..ఈ విషయంలో ఎంతటోళ్లైనా వదిలిపెట్ట : హరీశ్రావు
  • వాళ్లలాగా మేము దిగజారి మాట్లాడలేం
  • దానంపై సుప్రీంతీర్పు రేవంత్​కు చెంపపెట్టు
  • బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​లీడర్​ హరీశ్​రావు  

హైదరాబాద్, వెలుగు: తాను క్షుద్రపూజలు చేశానంటూ ఎవరైనా మాట్లాడితే కోర్టుకు ఈడుస్తానని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ డిప్యూటీ ఫ్లోర్​ లీడర్​ హరీశ్​ రావు అన్నారు. ఈ విషయంలో పీసీసీ చీఫ్​మహేశ్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​అసత్య ప్రచారం చేస్తున్నారని.. అందుకే వారిపై పరువు నష్టం దావా కేసు వేశామని చెప్పారు. గురువారం ఆయన నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వద్ద మీడియాతో మాట్లాడారు.

దేవుళ్ల దగ్గరకు వెళ్తే కూడా క్షుద్ర పూజలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంతకంటే దిగజారుడు రాజకీయాలు ఉండవని చెప్పారు. గోబెల్స్​ ప్రచారం చేస్తే ఎంతటోళ్లైనా కోర్టుకీడుస్తామని హెచ్చరించారు. వాళ్లలాగా తాము దిగజారి మాట్లాడలేమన్నారు. మూడేండ్లవుతున్నా ఇప్పటికీ డిప్యూటీ స్పీకర్​ను ఎన్నుకోలేదన్నారు. ప్రివిలేజెస్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్  ఉంటారని, ఏవైనా ఫిర్యాదులను ఆయనే పరిశీలించి చర్యలు తీసుకుంటారని చెప్పారు.

ఎన్నిసార్లు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్  పట్టించుకోవడం లేదన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీళ్ల కష్టాలు, కరెంట్ కష్టాలు రాష్ట్రాన్ని చుట్టు ముట్టినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదన్నారు. 

సుప్రీం తీర్పు రేవంత్​కు చెంపపెట్టు

దానం నాగేందర్​ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్​కు చెంపపెట్టు అని హరీశ్​ అన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్ కు ఇది గట్టి గుణపాఠమన్నారు. అధికారం ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు ప్రవర్తిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవన్నారు. న్యాయవ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా వస్తున్న తీర్పులను స్వాగతిస్తున్నామని చెప్పారు.

దానం ఒక్కరే కాదు.. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలని రేవంత్​కు సవాల్​ విసిరారు. కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే కనిపించడం లేదా? మీ మాటల్లో నిజాయితీ లేదా? అని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చింది అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. ఆ చట్టాన్ని ఎందుకు తుంగలో తొక్కుతున్నారని నిలదీశారు. రాజ్యాంగం మీద నిజంగా గౌరవం ఉంటే, వెంటనే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్​ చేశారు.