ఎవరూ కరెంట్ ​బిల్లులు కట్టొద్దు: హరీశ్ రావు

ఎవరూ కరెంట్ ​బిల్లులు కట్టొద్దు: హరీశ్ రావు

పటాన్​చెరు, వెలుగు: ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్​ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తోందని మాజీ మంత్రి హరీశ్​రావు అన్నారు. ఆదివారం పటాన్​చెరులోని జీఎంఆర్​ఫంక్షన్​హాల్​లో బీఆర్ఎస్​ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి హాజరైన హరీశ్ రావు మాట్లాడుతూ హామీల్లో భాగంగా 200  యూనిట్ల వరకు ఉచిత కరెంట్​ఇస్తామని చెప్పారని దాన్ని ఇంకా నెరవేర్చలేదన్నారు. అందుకని ఎవ్వరూ కరెంటు బిల్లులు కట్టవద్దన్నారు. రైతుబంధు, పెన్షన్లు, రైతు బీమా ఇంకా అమలు కాలేదన్నారు.

జనవరి నెల పెన్షన్లు ఎగరగొట్టిన కాంగ్రెస్​ పార్టీ 48 లక్షల మంది పేదల కడుపు కొట్టిందన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో సుమారు ఆరు లక్షల మంది ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారన్నారు. పార్లమెంట్​ఎన్నికల్లో మెదక్​లో ఎగిరేది బీఆర్ఎస్ ​జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు పటాన్​ చెరు బస్టాండ్​ ఏరియాలో ఆటోడ్రైవర్లను కలిసి మాట్లాడారు. ప్రతాపరెడ్డి, జడ్పీ వైస్ ​చైర్మన్ ప్రభాకర్ పాల్గొన్నారు.