హైదరాబాద్, వెలుగు: ఆగ్రో సెంటర్లు, సొసైటీల్లో యూరియా స్టాక్ ఉన్నా రైతులకు యూరియా ఎందుకివ్వడం లేదో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా అమ్మకాలపై అనధికార బ్యాన్ విధించడం దిక్కుమాలిన చర్య మంగళవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. యూరియా దొరక్కపోవడంతో చెరకు, పండ్ల తోటలు, కూరగాయలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎరువుల కష్టాలను మరింత ఎక్కువ చేసేలా రూపొందించిన యాప్ రైతుల పాలిట శాపంగా మారిందన్నారు.
యూరియా సరఫరాపై దృష్టి సారించడం మానేసి, వినియోగం తగ్గించాలని చెప్పడం, దీనిపై డబ్బులు వెచ్చించి ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. ధాన్యం కొనుగోళ్లు జరగక రైతులు ఆందోళనలో ఉంటే ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహిస్తుండటం వారిని అవమానించడమే తెలిపారు. రైతు బంధు ఇవ్వడంలో ఫెయిల్.. బోనస్ చెల్లించడంలో ఫెయిల్.. పంటల బీమా పథకం అమలులో ఫెయిల్.. రుణమాఫీ చేయడంలో ఫెయిల్.. యూరియా సరఫరాలో ఫెయిల్.. పంట కొనుగోలులో ఫెయిల్.. కొన్న పంటకు బోనస్ ఇవ్వడంలో ఫెయిల్.. ఈ వైఫ్యల్యాలను కవర్ చేసుకోవడానికి వారోత్సవాల పేరిట డ్రామా చేస్తున్నారని ఆరోపించారు. రైతులు నిలదీస్తారని భయపడి, అధికారులు రైతు వేదికల నుంచి పారిపోయే పరిస్థితి రావడం మీ పాలనా వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.
