బనకచర్లను ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? : హరీశ్ రావు

బనకచర్లను ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? : హరీశ్ రావు
  • కేంద్ర మంత్రి లేఖ రాసినా స్పందించరా?: హరీశ్​ రావు

హైదరాబాద్, వెలుగు: బనకచర్ల ప్రాజెక్టును ఆపే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా? లేదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్​ టెక్నో ఎకనామికల్​అప్రైజల్​కోసం వచ్చిందంటూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్​పాటిల్​గత నెల 23న సీఎం రేవంత్​కు లేఖ రాసినా ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదని ఆయన ఆరోపించారు. అనుమతులు ఇవ్వొద్దంటూ కేంద్ర మంత్రికి ఇప్పటికీ సీఎం రేవంత్​ లేఖ రాయకపోవడం రాష్ట్ర ప్రజలను మోసం చేయడమేనని మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. ఈ నెల 6నే బనకచర్ల డీపీఆర్​కు ఏపీ నోటిఫికేషన్ ఇచ్చినా.. ఇప్పటికీ సీఎంగానీ, ఇరిగేషన్​ శాఖ మంత్రిగానీ కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. 

ప్రాజెక్టును అడ్డుకోవాలంటూ ఇరిగేషన్ సెక్రటరీతోనైనా ఎందుకు లెటర్ రాయించలేదని ప్రశ్నించారు. పాత డేట్ వేసి ఈఎన్​సీతో సీడబ్ల్యూసీకి ఉత్తరం రాస్తే ఏం లాభమని ప్రశ్నించారు. ప్రాజెక్టును కట్టేందుకు ఏపీ ఓ వైపు వేగంగా ముందుకు వెళ్తుంటే.. కాంగ్రెస్​ ప్రభుత్వం మాత్రం పాత డేట్లు వేసి ప్రజలను మభ్యపెడుతున్నదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కర్నాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే వారి డిమాండ్లు, అభ్యంతరాలను స్పష్టంగా కేంద్రానికి తెలిపాయన్నారు. తెలంగాణ మాత్రం ఇన్ని రోజులుగా మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యం ఏమిటో రేవంత్ రెడ్డికే తెలియాలని విమర్శించారు.