ట్రబుల్​ షూటర్​కు షాకిచ్చిన దుబ్బాక

ట్రబుల్​ షూటర్​కు షాకిచ్చిన దుబ్బాక

సిద్దిపేట, వెలుగు: టీఆర్​ఎస్​లో ఎలక్షన్స్ స్పెషలిస్ట్.. ట్రబుల్ షూటర్.. మంత్రి హరీశ్​రావుకు దుబ్బాక రిజల్ట్ షాకిచ్చింది. ఎలక్షన్లయినా, బై ఎలక్షన్లయినా, పార్టీకి సంబంధించి ఏ క్రైసిస్ అయినా ఆయన ఇన్వాల్వ్ అయితే సక్సెస్ పక్కా అని అందరూ నమ్మేవాళ్లు. ఇప్పటిదాక అప్పగించిన ఏ టాస్క్​లోనూ ఫేయిల్ కాని హరీశ్​రావుకు తన సొంత జిల్లాలోని పక్క నియోజకవర్గంలోనే ఎదురుదెబ్బ తగిలింది. రామలింగారెడ్డి చనిపోయినప్పటి నుంచి దుబ్బాక బైఎలక్షన్లలో హరీశ్ అన్నీ తానై వ్యవహరించినా.. టీఆర్ఎస్​ను గెలిపించలేకపోయారు. పరకాల, నారాయణఖేడ్ బైఎలక్షన్లతో పాటు.. 2018 ఎన్నికల్లో కొడంగల్, గద్వాల అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్ చార్జిగా ఎదుటి పార్టీలను చిత్తు చేసి టీఆర్​ఎస్ క్యాండిడేట్లను  గెలిపించుకున్న హరీశ్​రావు స్ట్రాటజీలు దుబ్బాకలో పనిచేయలేదు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నియోజకవర్గమంతా తిరుగుతూ అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభించినా.. ప్రచార బాధ్యతలను తన భుజమ్మీద వేసుకుని ఊరూరూ తిరిగారు. ఇతర పార్టీలకు చెందిన నేతలను, కార్యకర్తలను ఆకర్షించి టీఆర్​ఎస్​లో చేర్చుకోవడం.. ఇంటింటికీ వెళ్లి ఆప్యాయంగా పలకరించడం.. దుబ్బాకను ఆనుకుని ఉన్న సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల సెగ్మెంట్ల లెక్క అభివృద్ది చేస్తానని నమ్మబలకడం.. రాత్రి అంతా ఎలక్షన్​ మేనేజిమెంట్​ చేయడం.. ఇలా డే అండ్ నైట్ కష్టపడ్డారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావునే లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేశారు. కేంద్రం వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడుతుందని  ఎంతగానో ప్రచారం చేసినా ఓటర్లు పట్టించుకోలేదు. తన కష్టం, ఎత్తుగడలు పనిచేయకపోవడం హరీశ్ ను షాక్​కు గురిచేశాయి. ఈ ఓటమి హరీశ్ ఇమేజ్ మీద ప్రభావం చూపుతుందన్న ప్రచారం కూడా జరుగుతోంది.