ఎల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ ఎనిమిదేళ్ల కల : హరీష్ శంకర్

ఎల్లువొచ్చి గోదారమ్మ రీమిక్స్ ఎనిమిదేళ్ల కల : హరీష్ శంకర్

‘వాల్మీకి’ కోసం  రీమిక్స్ చేసిన వెల్లువొచ్చి గోదారమ్మ పాటను మంగళవారం విడుదల చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన దర్శకులు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘వాల్మీకి టీమ్ నన్ను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. ఈ పాట లొకేషన్స్ చూడటానికి వెళ్లినప్పుడు ఉండ్రాజవరంలో బిందెల తయారీ చప్పుడు విని.. అవి అద్దెకు తెచ్చి తీశాం.  పాట అనేది కళ్లకి, చెవులకి ఆనందం కలిగించేది. మిక్కీ పాటలు బాగున్నాయి. ‘ఒక లైలా కోసం’ సమయంలోనే పూజ టాప్ హీరోయిన్ అవుతుందని చెప్పాను. వరుణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హరీష్ అద్భుతంగా తీశాడు. ‘దేవత’ ఇరవై అయిదు వారాలు ఆడినట్టు ఈ సినిమా కూడా ఆడాలని ఆశిస్తున్నాను’ అన్నారు.

‘ఈ పాట తీయాలనేది ఏడెనిమిదేళ్ల కల. ఎనభైల్లో సలీమ్ మాస్టర్ ఫాలో అయిన స్టైల్లోనే ఉండాలని శేఖర్ మాస్టర్‌‌‌‌కి చెప్పాను. ఆ గ్రేస్ తగ్గకుండా చేశారు. పూజ చాలా కష్టపడింది. వరుణ్ డ్యాన్స్ రాదంటాడు కానీ
అద్భుతంగా చేశాడు. 500 బిందెలు అడిగితే 1500 బిందెలు మధురై నుంచి తెప్పించారు నిర్మాతలు.  గురువుకు శిష్యుడు ఇచ్చే పువ్వులాంటిదీ పాట’ అని చెప్పాడు హరీష్ శంకర్. వరుణ్ తేజ్ మాట్లాడుతూ ‘పాటలు, డ్యాన్సులు నా కంఫర్ట్ జోన్ కాదు. శ్రీదేవి గారి పాట రీమిక్స్ అనగానే ఎగ్జైటయ్యాను. బాలు గారి వాయిస్‌‌కి నేను యాక్ట్ చేస్తాననుకోలేదు.  శోభన్ బాబు గారు, శ్రీదేవి గారిలా మేము చేయలేం. కానీ ప్రయత్నించాం’ అన్నాడు. పూజ మాట్లాడుతూ‘వరుణ్ రెట్రో ఎక్స్‌‌ప్రెషన్స్‌‌తో సర్‌‌‌‌ప్రైజ్ చేశాడు. శ్రీదేవి గారిలా చేయడానికి  భయపడ్డాను. ఇరవై సార్లు  పాట చూసి ఆ మ్యాజిక్‌‌ని రీక్రియేట్ చేయడానికి ప్రయత్నించాను’ అని చెప్పింది. మిక్కీ జె మేయర్ మాట్లాడుతూ ‘ఈ పాటని రీమిక్స్ చేయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఎస్పీబీ మళ్లీ  పాడారు. సుశీల గారి గాత్రం అలాగే ఉంచాం’ అని చెప్పారు. కొరియోగ్రాఫర్ శేఖర్, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్, వేటూరి తనయుడు రవి పాల్గొన్నారు.