సిట్ విచారణకు హరీశ్..జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీ బందోబస్తు

సిట్ విచారణకు హరీశ్..జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గర భారీ బందోబస్తు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయంలో  డీసీపీ విజయ్ కుమార్  బృందం హరీశ్ ను విచారిస్తోంది. విచారణకు హరీశ్  న్యాయవాదిని పోలీసులు లోపలికి అనుమతించలేదు .  

మరో వైపు జూబ్లీహిల్స్ పీఎస్ దగ్గరకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్,  బీఆర్ఎస్  సీనియర్ నాయకులు మాజీ మంత్రులు కార్యకర్తలు చేరుకున్నారు. దీంతో 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.  

ప్రభుత్వ హామీలు, సీఎం బామ్మర్ది అవినీతి బాగోతాన్ని బయటపెట్టినందుకే తనకు సిట్ నోటీసులిచ్చిందని హరీశ్ రావు ఆరోపించారు. ఇదంతా సీఎం రేవంత్ డైరెక్షన్ లో సిట్ యాక్షన్ అని అన్నారు. తప్పు చేయలేదని..ఎవరికీ భయపడేది లేదన్నారు హరీశ్. తనపై  ఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు,సుప్రీం కోర్టు కొట్టివేసిందన్నారు. కోర్టు కొట్టివేసిన కేసులో సిట్ నోటీసులివ్వడమేంటని ప్రశ్నించారు హరీశ్ రావు. 

తెలంగాణలో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే నోటీసులు ఇచ్చారన్నారు. సమాజంలో చట్టం పై తమకు గౌరవం ఉందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న తమకు  అరెస్టులు కొత్త కాదన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు మహాలక్ష్మి స్కీమ్, వృద్ధాప్య పెన్షన్ గురించి ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చారని విమర్శించారు హరీశ్.  తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నది నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ కు.. మున్సిపల్ ఎన్నికల ముందు తనకు నోటీసులు ఇచ్చారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంచనాలు తలకిందులయ్యాయని తెలిపారు.