
కేంద్రం ఆంక్షల వల్లే జీతాలు లేట్
యూఎస్పీసీ ప్రతినిధులతో మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, వెలుగు : కేంద్ర ప్రభుత్వం విధించిన ఆర్థిక ఆంక్షల వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ప్రకటన, జీతాల చెల్లింపు ఆలస్యం అవుతోందని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్రమంగా మెరుగుపరుచుకొని, సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. బుధవారం మంత్రిని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) స్టీరింగ్ కమిటీ సభ్యులు కలిసి వివిధ అంశాలపై వినతి పత్రం ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ.. ‘‘హెల్త్ కార్డులపై నగదు రహిత వైద్యం అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఉద్యోగుల నుంచి చందా ఎంత మినహాయించాలనే అంశంపై ఏకాభిప్రాయం లేనందుకే అమలు చేయలేకపోతున్నాం.
టీఎన్జీవోలు వేతనంలో 2% చందా ఇస్తామని రాసిచ్చారు. బదిలీలు, ప్రమోషన్లకు కూడా రంగం సిద్ధం చేస్తున్నాం” అని వెల్లడించారు. మంత్రిని కలిసిన తర్వాత యూఎస్పీసీ ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు, టీచర్లకు డీఏ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ సిఫారసు మేరకు ఆర్పీఎస్ 2020కి అనుబంధంగా ఇవ్వాల్సిన స్పెషల్ పే, కన్వేయన్స్, ఏజన్సీ తదితర అలవెన్సులు, సెలవులు, ఇతర అంశాలపై రివైజ్డ్ ఉత్తర్వులిన్నారు. జీతాలు ప్రతినెలా 1న ఇవ్వాలని కోరారు.