హరీశ్​రావు ​కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు

హరీశ్​రావు ​కొత్త పార్టీ పెడ్తడు : రఘునందన్ రావు
  •  రేవంత్, హరీశ్ ఇద్దరూ రాజీనామా చేయరు 

నిజాంపేట, వెలుగు: బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చి కేసీఆర్, కేటీఆర్​ను మీడియాలో రాకుండా చేసి  హరీశ్​రావు కొత్త పార్టీ పెడతారని మెదక్  బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు. శుక్రవారం నిజాంపేట మండల కేంద్రంలో ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఐదేండ్ల పాటు అధికారంలో ఉండి ఆర్థిక మంత్రిగా పనిచేసి రైతులకు రూ. లక్ష రుణమాఫీ చేయలేని హరీశ్ రావు, మాజీ సీఎం కేసీఆర్  ఇద్దరూ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకోవాలన్నారు. 

నెలకు రూ. 4 వేల పెన్షన్ ఎందుకు ఇస్తలేరని సీఎం రేవంత్ రెడ్డిని అడిగితే ‘ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయని వస్తే.. ఖాళీ బిందెలు ఉన్నాయి’ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీడియా, ప్రజల దృష్టిని మళ్లించడానికి హరీశ్ రావు,  రేవంత్ రెడ్డి కొత్త నాటకాలు మొదలుపెట్టారని విమర్శించారు. మార్చి 19న ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వస్తూ రేవంత్ రెడ్డి, హరీశ్ రావు విమానంలో చర్చలు జరిపారని ఆయన ఆరోపించారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్  రెండూ ఒక్కటై బీజేపీని ఓడించాలని చూస్తున్నాయన్నారు. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ ఆడుకోమంటే ఢిల్లీలో సారా దుకాణాలు పెట్టి తెలంగాణ పరువు తీసిందన్నారు. లిక్కర్  స్కామ్ లో  ఆమె రూ.100 కోట్లు వెనకేసుకుందని చెప్పారు. వెన్నెముక విరిగి బయటకు రాకపోతే మొత్తానికే ప్రజలు మర్చిపోతారని మాజీ సీఎం కేసీఆర్  బస్సు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు.