అప్పడాలకు షేప్‌ను బట్టి జీఎస్టీ వేస్తారా?

అప్పడాలకు షేప్‌ను బట్టి జీఎస్టీ వేస్తారా?

ముంబై: దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఆర్పీజీ గ్రూప్ చైర్మన్ హర్ష గోయెంకాకు జీఎస్టీపై ఓ వింత డౌట్ వచ్చింది. షేప్‌ను బట్టి అప్పడాలపై టాక్స్ వేస్తున్నారా అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వైరల్ కావడంతో తప్పుడు సమాచారం ప్రజల్లోకి వెళ్తుందని.. దీనిపై కేంద్ర ప్రభుత్వ స్పందించింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్‌ అండ్ కస్టమ్స్‌ (CBIC) ఫ్యాక్ట్ చెక్‌ చేసి జీఎస్టీ రూల్స్ గురించి వివరణ ఇస్తూ ట్వీట్ చేసింది. ఆయన చేసిన ట్వీట్‌లో నిజం లేదని, అది ఫేక్ సమాచారం అని తేల్చింది.

‘‘మీకిది తెలుసా?  రౌండ్‌గా ఉండే అప్పడాలపై జీఎస్టీ మినహాయింపు ఉంది. కానీ స్క్వేర్‌‌ షేప్‌లో ఉండే అప్పడాలపై మాత్రం జీఎస్టీ వసూలు చేస్తున్నారు. దీని గురించి క్లారిటీ ఇచ్చేందుకు మీకు తెలిసిన మంచి చార్టెడ్ అకౌంటెంట్ (సీఏ) ఎవరైనా ఉంటే చెప్పండి” అంటూ మంగళవారం నాడు హర్ష గోయెంకా ట్వీట్‌ చేశారు. దీనిపై స్పందించిన CBIC.. ఆయన ట్వీట్‌లో నిజం లేదని తేల్చింది. ‘‘అప్పడాలు ఎలా ఉన్నా సరే జీఎస్టీ లేదు. జీఎస్టీ నోటిఫికేషన్‌ No.2/2017-CT(R) లోని రూల్‌ నంబర్ 69 చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అప్పడం ఏ షేప్‌లో ఉన్నా సరే ట్యాక్స్ ఉండదు” అని పేర్కొంది.