పెద్దల సభకు కొత్త మెంబర్లు.. నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి

పెద్దల సభకు కొత్త మెంబర్లు.. నలుగురిని నామినేట్ చేసిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాజ్యసభకు నలుగురు కొత్త సభ్యులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నామినేట్ చేశారు. పలువురు సభ్యుల పదవీకాలం ముగియడంతో వారి స్థానంలో వీరిని నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రముఖ న్యాయవాది ఉజ్వల్​నికం, మాజీ దౌత్యవేత్త హర్ష్​వర్ధన్​శ్రింగ్లా, చరిత్రకారిణి డాక్టర్​మీనాక్షి జైన్, కేరళకు చెందిన టీచర్, సోషల్​ వర్కర్​ సీ సదానందన్​మాస్టర్‌‌‌‌ను రాజ్యసభకు పంపుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలోనే ప్రముఖ న్యాయవాది ఉజ్వల్​

దేశంలోనే ప్రముఖ న్యాయవాదుల్లో ఒకరిగా ఉజ్వల్​నికంకు పేరున్నది. ఆయన 26/11 టెర్రర్​అటాక్స్‌‌తో పాటు ఉన్నతస్థాయి క్రిమినల్​కేసులను వాదించారు. 2024  జనరల్​ఎలక్షన్స్‎లో ముంబై నార్త్​సెంట్రల్​లోక్​సభ స్థానంనుంచి బీజేపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్​ క్యాండిడేట్​వర్ష గైక్వాడ్​ చేతిలో ఓడిపోయారు. ఇక హర్ష్​వర్ధన్​శ్రింగ్లా మాజీ దౌత్యవేత్త. యూఎస్, బంగ్లాదేశ్, థాయ్​లాండ్​ దేశాల అంబాసిడర్‎గా పనిచేశారు. 2023లో జరిగిన జీ20 ప్రెసిడెన్సీలో భారత చీఫ్​కోఆర్డినేటర్‌‌‌‌గా వ్యవహరించారు.

కేరళకు చెందిన సి. సదానందన్ మాస్టర్ టీచర్‎గా పనిచేశారు. ప్రస్తుతం సోషల్​వర్కర్‌‌‌‌గా, బీజేపీ నేతగా కొనసాగుతున్నారు.​1994లో సీపీఎం నేతల దాడిలో ఆయన రెండు కాళ్లు పోగొట్టుకున్నారు.  2021 కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీచేశారు.  డాక్టర్​మీనాక్షి జైన్​.. ప్రముఖ చరిత్రకారిణి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన గార్గి కాలేజీలో హిస్టరీ అసోసియేట్​ప్రొఫెసర్‎గా పనిచేశారు. విద్యా రంగంలో ఆమె చేసిన కృషికి 2020లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. కాగా, రాజ్యసభకు నామినేట్​అయిన నలుగురికి ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా అభినందనలు తెలిపారు.