హర్షల్ పటేల్కు బంపర్ ఆఫర్ 

హర్షల్ పటేల్కు బంపర్ ఆఫర్ 

బెంగళూరు: టీమిండియా యువ బౌలర్‌ హర్షల్‌ పటేల్‌కు బంపర్‌ ఆఫర్‌ తగిలింది. కనీస ధర రూ. 2 కోట్లతో వేలంలోకి వచ్చిన హర్షల్‌ పటేల్‌ను.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 10.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ 2022 వేలంలో భారత స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రికార్డు ధరకు అమ్ముడుపోయాడు. ఈ ధనాధన్ ఆటగాడ్ని రూ.12.25 కోట్లు పెట్టి కోల్ కతా నైట్ రైడర్స్ దక్కించుకుంది. అయ్యర్ తర్వాత హర్షల్ అత్యధిక ధర దక్కించుకున్నాడు. గత సీజన్ లో ఆర్సీబీ తరఫున 32 వికెట్లతో పర్పుల్ క్యాప్ దక్కించుకున్న హర్షల్ పటేల్ పై నమ్మకం ఉంచిన ఆర్సీబీ.. మరోసారి అతడ్ని కొనుగోలు చేసింది. 

భారీ ధర పలికిన రబాడ, హోల్డర్  

వేలంలో సౌతాఫ్రికా సీమర్ కగిసో రబాడ, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధవన్, వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్ తోపాటు భారత అన్ క్యాప్డ్ ప్లేయర్ నితీశ్ రాణా మంచి ధర పలికారు. రబాడను రూ.9.25 కోట్లు, శిఖర్ ధవన్ ను రూ.8.25 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. జేసన్ హోల్డర్ ను రూ.8.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్, నితీశ్ రాణాను రూ.8 కోట్లకు కేకేఆర్ దక్కించుకున్నాయి. ఆసీస్ పేసర్ ప్యాట్ కమిన్స్ ను రూ.7.25 కోట్లకు కోల్ కతా నైట్ రైడర్స్.. న్యూజిలాండ్ సీమర్ ట్రెంట్ బౌల్ట్ ను రూ.8 కోట్లు, స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను రూ.5 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకున్నాయి. సీనియర్ పేసర్ మహ్మద్ షమిని రూ.6.25 కోట్లకు గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా సీనియర్ బ్యాటర్ ఫాఫ్ డుప్లెసిస్ ను రూ.7 కోట్లకు బెంగళూరు చాలెంజర్స్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను రూ.6.25 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుక్కున్నాయి. ప్రొటీస్ ఓపెనర్ క్వింటన్ డికాక్ ను రూ.6.75 కోట్లు పెట్టి లక్నో టీమ్ దక్కించుకుంది. 

పడిక్కల్కు ఊహించని ధర

రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 7.75 కోట్లు వెచ్చించి యంగ్ బ్యాట్స్ మన్ పడిక్కల్‌ను కొనుగోలు చేసింది. గత సీజన్‌లో ఆర్‌సీబీకి రూ.20 లక్షలకు అమ్ముడుపోయిన పడిక్కల్‌ దుమ్మురేపిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్‌ హిట్టర్‌ హెట్‌మైర్‌కు వేలంలో మంచి ధరే దక్కింది. అతని కనీస ధర రూ. 1.50 కోట్లు కాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ పోటీపడ్డాయి. చివరకు రాజస్తాన్‌ రాయల్స్‌ రూ. 8.25 కోట్లకు హెట్‌మైర్‌ను దక్కించుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్‌కు దీపక్‌ హుడా టీమిండియా ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడాను రూ. 5.75 కోట్లతో లక్నో సూపర్‌జెయింట్స్‌ దక్కించుకుంది. కనీస ధర రూ. 75 లక్షలుగా ఉన్న దీపక్‌ హుడాకు ఇది మంచి ధరే అని చెప్పొచ్చు. 

రైనాకు షాక్

టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్‌ రైనాతో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు మిల్లర్‌ను కొనడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. సీనియర్ ఆటగాళ్లు, మంచి అనుభవం కలిగిన వీళ్లను కొనడానికి ఫ్రాంచైజీలు ఆసక్తి చూపుతాయని అందరూ అనుకున్నారు. అయితే యాక్సిలరేటెడ్‌ లిస్ట్‌లో ఈ ముగ్గురు మరోసారి వేలంలోకి రానున్నారు.

వేలంలో అపశృతి

ఐపీఎల్ వేలంలో అపశృతి చోటుచేసుకుంది. వేలంపాట పాడుతున్న హ్యూజ్ ఎడ్మీడ్స్ ఉన్నట్లుండి కింద పడిపోయాడు. దీంతో అందరూ భయాందోళనలకు లోనయ్యారు. అయితే  నిర్వాహకులు వేలంను ఆపేశారు. అప్పటికి శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ రూ.10.75 కోట్లతో వేలంలో ఉన్నాడు. ఎడ్మీడ్స్ కు నిర్వాహకులు వైద్యసాయం అందించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది. ఆక్షన్ ను తిరిగి 3.30 గంటలకు ప్రారంభిస్తామని అఫీషియల్ బ్రాడ్ కాస్టర్స్ తెలిపారు.

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్.. నిరుద్యోగులు నిన్ను తరమకుండా చూస్కో

భారీ ధరకు అమ్ముడుపోయిన భారత స్టార్ బ్యాట్స్మన్

హిజాబ్ వివాదంపై స్పందించిన విదేశాంగ శాఖ