
న్యూయార్క్: క్యాన్సర్ను తొలినాళ్లలో గుర్తిస్తే చికిత్సతో రోగులు కోలుకునే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతుంటారు.. అయితే, ఈ వ్యాధి ఎంతోకొంత ముదిరితే కానీ లక్షణాలు బయటపడవని, ఆ తర్వాత బాధితులకు అందించే చికిత్స వల్ల జీవితాంతం వివిధ దుష్ప్రభావాలు ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు.
ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీ అనుబంధ ఎన్జీవో సంస్థ ‘మాస్ జనరల్ బ్రిగ్ హాం’.. హెడ్, నెక్ క్యాన్సర్ (తల, మెడ భాగంలో వచ్చే క్యాన్సర్ల) ను పదేళ్ల ముందే గుర్తించే రక్త పరీక్షను అభివృద్ధి చేసింది. లక్షణాలు బయటపడడానికి చాలా ముందే ఈ క్యాన్సర్లను దాదాపు కచ్చితంగా గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు నిర్వహించిన పరిశోధనలలో కచ్చితమైన ఫలితాలను సాధించామని వివరించారు.
ఎలా గుర్తిస్తుందంటే..
హెడ్, నెక్ క్యాన్సర్లకు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్ పీవీ) అని పలు అధ్యయనాల్లో తేలింది. వంద మంది బాధితులలో 70 మంది ఈ వైరస్ కారణంగానే క్యాన్సర్ బారిన పడినట్లు బయటపడింది. ఈ క్రమంలోనే క్యాన్సర్ కు దారితీయకముందే గుర్తించే హెచ్ పీవీని గుర్తించేందుకు మాస్ జనరల్ బ్రిగ్ హాం సంస్థ శాస్త్రవేత్త పరిశోధన చేపట్టారు. వైరస్ ను గుర్తించేందుకు హెచ్ పీవీ– డీప్ సీక్ పేరుతో సరికొత్త లిక్విడ్ బయాప్సీ టెస్టును అభివృద్ధి చేశారు.
హెడ్, నెక్ క్యాన్సర్ ను ముందే గుర్తించేందుకు 56 మంది వాలంటీర్ల నుంచి రక్తం సేకరించి హెచ్ పీవీ– డీప్ సీక్ టెస్టు చేశామని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన హార్వర్డ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డేనియల్ ఎల్ ఫాడెన్ తెలిపారు. ఈ 56 మందిలో 28 మందికి హెచ్ పీవీ పాజిటివ్ వచ్చిందని, తదనంతర కాలంలో ఆ 28 మందిలో 22 మంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల బారిన పడ్డారని తెలిపారు. హెచ్ పీవీ నెగెటివ్ వచ్చిన 28 మందిలో ఒక్కరు కూడా క్యాన్సర్ బారిన పడలేదన్నారు.