- దుకాణాలకు స్వల్ప మినహాయింపులు
- ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు దుకాణాలు తెరచుకునేందుకు అనుమతి
- సరి-బేసి విధానంలో దుకాణాలు తెరచుకోవాలి
- జూన్ 15 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్: సీఎం మనోహర్ లాల్ ఖట్టర్
చండీఘడ్: హర్యానాలో జూన్ 7వరకు లాక్ డౌన్ పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దుకాణాలకు స్వల్ప మినహాయింపులు కల్పించారు. గతంలో విధించిన లాక్ డౌన్ ఇవాళ్టితో ముగియనున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ జూమ్ ద్వారా మీడియా సమావేశం నిర్వహించి లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. విభిన్న రంగాలకు చెందిన వారి నుంచి వస్తున్న సూచనలు, వినతులపై చర్చించి కాస్త సడలింపులు కల్పిస్తున్నామని సీఎం చెప్పారు. దుకాణాలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు దుకాణాలు తెరచుకునేందుకు అనుమతిచ్చారు.
అయితే సరి-బేసి విధానంలో దుకాణాలు తెరచుకోవాలని కొత్త నిబంధన పెట్టారు. వరుసగా దుకాణాలు ఉన్న చోట్ల సరి బేసి విధానంలో ఒక దుకాణం పక్కనున్న దుకాణం రోజు విడిచి రోజు తెరచుకోవాల్సి ఉంటుంది. విద్యా సంస్థల మూసివేత జూన్ 15 వరకు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పరిస్థితి అనుకూలంగా లేనందున స్కూళ్లు, కాలేజీలు బంద్ కొనసాగుతుందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ స్పష్టం చేశారు. కరోనా కేసుల ఉధృతి తగ్గడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ప్రజలు కూడా నిబంధనలు పాటించి కరోనా కట్టడికి సహకరించాలని ఆయన కోరారు.
