రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోబోం

రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోబోం

చండీగఢ్: కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ హర్యానా, పంజాబ్‌‌లో రైతులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. తాజాగా ఈ నిరసనల్లో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ జాయిన్ అయ్యారు. సోమవారం పంజాబ్‌‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్ పాల్గొన్నారు. ఈ ర్యాలీ పంజాబ్ నుంచి హర్యానాకు వరకు కొనసాగనుంది. తాజాగా దీనిపై హర్యానా సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి ఆటంకం కలిగించబోమని, ఆయన ర్యాలీ చేసుకోవచ్చునని హర్యానా సర్కార్ తెలిపింది. మంగళ, బుధ వారాల్లో హర్యానాలోని కురుక్షేత్ర, కర్నాల్‌‌లో ట్రాక్టర్ ర్యాలీ జరగనుంది.

‘రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ హర్యానాలోకి వస్తే మేం అడ్డుకోబోం. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ఎలాంటి చర్యలకూ అవకాశం ఇవ్వాలని మేం భావించడం లేదు. చట్టానికి అనుగుణంగా శాంతియుతంగా నిర్వహిస్తే మాకే అభ్యంతరం లేదు’ అని హర్యానా ప్రభుత్వ అధికారి స్పష్టం చేశారు. ఇదిలా ఉంచితే ర్యాలీలో రాహుల్ గాంధీ ట్రాక్టర్‌‌పై కుషన్ వేసుకొని కూర్చోవడం హాట్ టాపిక్‌‌గా మారింది. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి స్పందించారు. ర్యాలీ పేరుతో ఎవరైనా ట్రాక్టర్‌‌పై సోఫా కుషన్ వేసుకొని కూర్చుంటారా అంటూ హర్దీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.