లైంగిక ఆరోపణలు.. హర్యానా మంత్రి రాజీనామా 

లైంగిక ఆరోపణలు.. హర్యానా మంత్రి రాజీనామా 

హర్యానా క్రీడాశాఖ మంత్రి, బీజేపీ నేత సందీప్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను మంత్రి వేధించారంటూ.. జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా పనిచేస్తున్న ఒక మహిళ రాష్ట్ర హోంమంత్రికి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీంతో క్రీడాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేస్తున్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. దర్యాప్తు నివేదిక వచ్చేదాకా.. తన శాఖను సీఎంకు అప్పగిస్తున్నానని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలన్నింటిని మంత్రి సందీప్ సింగ్ ఖండించారు.  ఇవన్నీ తప్పుడు అభియోగాలని దర్యాప్తులో తేలిపోతుందన్నారు. తన పేరు, ప్రతిష్ఠలను దెబ్బతీసేందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. 

బాధితురాలి ఆరోపణ  ఇదీ.. 

‘‘నేను జూనియర్ అథ్లెటిక్స్ కోచ్ గా పనిచేస్తున్నాను. మంత్రి సందీప్ సింగ్ నన్ను తొలిసారి  ఒక జిమ్ లో చూశారు. ఆ తర్వాత ఇన్ స్టాగ్రామ్ లో నాతో కాంటాక్ట్ లోకి వచ్చారు . ఇన్ స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేసిన మంత్రి..మీ నేషనల్ గేమ్స్ సర్టిఫికెట్ పెండింగ్ లో ఉందని చెప్పారు. దాని గురించి తనను కలవాలని సూచించారు.  ఈక్రమంలో మిగతా ఆధారాలు, పత్రాలతో నేను కలవడానికి వెళ్లగా.. మంత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈక్రమంలో అక్కడున్న సిబ్బంది ముందే నా టీ షర్టును మంత్రి చించారు. సాయం కోసం నేను అరిచినా.. అక్కడున్న వారెవరూ నాకు సాయం చేయలేదు’’ అని బాధిత మహిళ మంత్రిపై ఆరోపణలు చేసింది.