ఇథనాల్‌‌‌‌తో గంజాయి హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్

ఇథనాల్‌‌‌‌తో  గంజాయి హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తయారు చేస్తున్న ముఠా అరెస్ట్
  • వైజాగ్‌‌ నుంచి హైదరాబాద్​కు స్మగ్లింగ్
  • నలుగురు నిందితుల అరెస్ట్
  • 14 లక్షలు విలువ చేసే సరుకు సీజ్

హైదరాబాద్, వెలుగు: ఇథనాల్‌‌‌‌తో  గంజాయి హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తయారు చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌‌‌‌ నార్కోటిక్స్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌  పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద రూ.14 లక్షలు విలువ చేసే 300 లీటర్ల హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌, 400 లీటర్ల పెట్రోలియం ఇథనాల్‌‌‌‌, ట్రక్‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. మేడ్చల్‌‌‌‌ జిల్లా కుత్బుల్లాపూర్‌‌‌‌కు చెందిన ఎన్‌‌‌‌.ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (32)  ఏజెన్సీ ప్రాంతాల నుంచి హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ ను తక్కువ ధరకు తెచ్చి హైదరాబాద్‌‌‌‌, బెంగళూరులో అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. గంజాయి పండించే రైతులకు హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తయారీకి ఉపయోగించే ఇథనాల్‌‌‌‌ను అక్రమంగా సరఫరా చేస్తూ, వారి వద్ద నుంచి తక్కువ ధరకు హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను కొనుగోలు చేస్తున్నాడు. ఇలా గత  మూడేండ్లలో  హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నాడు. గంజాయిని విశాఖపట్టణం జిల్లా మాడ్గుల మండలం అలాగం గ్రామంలో రైతుల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి, హైదరాబాద్‌‌‌‌, బెంగళూరులో తన కస్టమర్లకు అమ్మేవాడు. ఈ క్రమంలోనే  గంజాయి రైతులతో హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ తయారు చేయించేందుకు ఒప్పందం చేసుకున్నాడు. కూకట్‌‌‌‌పల్లి ప్రశాంతి నగర్‌‌‌‌కు చెందిన నర్మదా ట్రేడర్స్‌‌‌‌, మహాలక్ష్మి కెమికల్‌‌‌‌ ట్రేడర్స్‌‌‌‌లో ఇథనాల్‌‌‌‌ను కొనుగోలు చేసేవాడు. రూ.100కు లీటర్‌‌‌‌ చొప్పున  కొనుగోలు చేసి  రూ.400కు గంజాయి పండించే గిరిజన రైతులకు అమ్మేవాడని పోలీసులు తెలిపారు. 

గోవాలోనూ నెట్​వర్క్​ .. 

ఏజెన్సీలో తయారు చేసిన హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను లీటర్‌‌‌‌కు రూ.30 వేల చొప్పున గిరిజన రైతుల వద్ద కొనుగోలు చేసి హైదరాబాద్‌‌‌‌లో రూ. 60 వేల నుంచి రూ. 70 వేలు, బెంగళూరులో రూ.1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల వరకు ప్రవీణ్  కుమార్   విక్రయిస్తున్నాడు. ఐదు గ్రాముల బాటిల్స్, ప్యాకెట్లలో ప్యాక్‌‌‌‌ చేసి స్మగ్లింగ్  చేశాడు. ఇలా ఇప్పటి వరకు 1400 లీటర్ల హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ను ప్రవీణ్‌‌‌‌.. ఏజెన్సీ ప్రాంతం నుంచి కొనుగోలు చేశాడు. గంజాయిని నేరుగా విక్రయించే స్టేజీ నుంచి ఏజెంట్ల ద్వారా అమ్మే స్థాయికి ఎదిగాడు. హైదరాబాద్‌‌‌‌, బెంగళూరుతో పాటు గోవాలో కూడా నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే పటాన్‌‌‌‌చెరుకు చెందిన పి.మోహన్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (26), కూకట్‌‌‌‌పల్లికి చెందిన పి.కల్యాణ్‌‌‌‌ (24), బి.సురేశ్ (26) ప్రవీణ్‌‌‌‌ వద్ద హాష్‌‌‌‌ ఆయిల్‌‌‌‌ కొనుగోలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం చిక్కడపల్లి ప్రాంతంలో ప్రవీణ్‌‌‌‌ నుంచి ఆ ముగ్గురు హాష్‌‌‌‌  ఆయిల్‌‌‌‌ కొంటున్నారని  సమాచారం అందడంతో  నార్కోటిక్స్ ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ వింగ్‌‌‌‌  ఇన్‌‌‌‌స్పెక్టర్‌‌‌‌‌‌‌‌ సి.రమేశ్ రెడ్డి నేతృత్వంలో అధికారులు సోదాలు చేశారు.  ప్రవీణ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌తో పాటు ముగ్గురిని అరెస్ట్‌‌‌‌ చేశారు.