వర్షాకాలంలో ఇబ్బందుల్లేకుండా చూడండి

వర్షాకాలంలో ఇబ్బందుల్లేకుండా చూడండి
  •  అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం

హైదరాబాద్, వెలుగు : వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందుల్లేకుండా చూడాలని, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది వెంటనే స్పందించేలా పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డును యూనిట్ గా తీసుకుని డిజాస్టర్ మేనేజ్మెంట్ ను ఇంటిగ్రేట్ చేయాలని సూచించారు. ఔటర్ లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలన్నారు.  

శనివారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సీఎం రేవంత్ సందర్శించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబుతో కలిసి వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై రివ్యూ చేపట్టారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేసేలా పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు తీసుకుంటున్న చర్యలపై అడిగి తెలుసుకున్నారు. 

ఇప్పటికే వరద తీవ్రత ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించామని, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని సీఎంకు అధికారులు వివరించారు. వరద వెళ్లేలా వాటర్ హార్వెస్ట్ లను ఏర్పాటు చేస్తున్నామని, రోడ్డుపై నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఫిజికల్ పోలీసింగ్ విధానం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించాలని సీఎం సూచించారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోంగార్డుల రిక్రూట్ మెంట్ చేపట్టాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవి గుప్త, సీపీ శ్రీనివాస్ రెడ్డి, సివిల్ సప్లయ్స్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు.