
ఈ ఏడు చెరుపుడు వానలే ఎక్కువ
దేశమంతా పంటలకు నష్టం
రబీ సీజన్‌కు మేలు: అనలిస్టులు
ఈ ఏడు దేశమంతా వానలు మస్త్ గా పడినయి. గత 25 ఏండ్లలోనే ఎక్కువ వానలు పడి ఈసారి దేశాన్ని ముంచెత్తినయి. ఇంకేం.. వానలు ఫుల్లుగా పడ్డయి కాబట్టి.. రైతన్నలు కూడా ఫుల్ ఖుషీ అయిపోయిండ్రని అనుకుంటున్నారా? ఈ ఖరీఫ్ సీజన్ ల రికార్డ్ స్థాయిలో వానలు దంచికొట్టిన మాట నిజమే అయినా.. వీటిలో ఎక్కువగా చెరుపుడు వానలే కురిశాయని, దేశవ్యాప్తంగా చాలా పంటలు డ్యామేజ్ అయి పెద్ద ఎత్తున నష్టం కూడా జరిగిందని అనలిస్టులు అంటున్నారు.
‘మంచి’ వానలు పడితేనే..
ప్రపంచంలో చెరకు, పత్తి, పప్పు పంటలు ఎక్కువగా పండిస్తున్న దేశం మనది. గోధుమ, వరి సాగులో రెండో స్థానంలో ఉన్నాం. దేశంలోని 130 కోట్ల జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థలో 15% వాటా వ్యవసాయ రంగానిదే. వానాకాలంలో పంటలు దెబ్బతినకుండా ఎంత ఎక్కువగా చేతికి వస్తాయన్న దానిపైనే లాభాలు ఆధారపడి ఉంటాయని, అలా కాకుండా చెరుపుడు వానలే ఎక్కువగా పడితే పెద్దగా లాభం ఉండదని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.
ఎక్కువ నష్టం ఈ పంటలకే..
వానాకాలంలో చెరుపుడు వానలే ఎక్కువ పడటం వల్ల సోయాబీన్, వరి, పత్తి, చెరకు, పప్పులు, కూరగాయల పంటలకు ఎక్కువ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో సోయాబీన్ సాగులో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. కానీ ఇక్కడ యావరేజ్ కంటే 44% ఎక్కువ వానలు పడ్డాయి. పూత దశలోనే పంటలు దెబ్బతినడంతో దిగుబడులు చాలా వరకూ తగ్గాయి. చెరకు సాగులో మహారాష్ట్ర, కర్నాటక రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆగస్టు మొదటి వారంలో వరదలు ముంచెత్తి చెరకు పంటలు మునిగాయి. దీనివల్ల మూడేళ్లలోనే తక్కువ దిగుబడి నమోదయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక గుజరాత్, మహారాష్ట్ర పత్తి సాగులో టాప్ రాష్ట్రాలు. కానీ సెప్టెంబర్‌లో భారీ వానలు పడటంతో చేతికందాల్సిన పత్తి నేలపాలైపోయింది. దక్షిణ, పశ్చిమ రాష్ట్రాల్లో ఎక్కువ వానల వల్ల, పశ్చిమ బెంగాల్లో తక్కువ వానల వల్ల వరికి నష్టం జరిగింది. మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ లలో భారీ వర్షాలకు టొమాటో, ఉల్లి వంటి కూరగాయ పంటలు కుళ్లిపోయాయి.
అగ్రికల్చర్ ట్రేడ్ పైనా ప్రభావం
వంటనూనెలను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఇండియా కూడా ఒకటి. ఈసారి సోయా పంటలు ఎక్కువగా దెబ్బతినడంతో పామ్ ఆయిల్, సోయా ఆయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు ఎక్కువగా చేసుకోవాల్సి వస్తుందని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మరోవైపు పత్తి పంట ఆలస్యం కావడంతో ఎగుమతులు ఆలస్యమై అంతర్జాతీయ మార్కెట్ లో ఆ రకంగానూ నష్టం జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పప్పు ధాన్యాల దిగుబడులు తగ్గడంతో వాటి దిగుమతులు కూడా పెరుగుతాయంటున్నారు. ఈసారి డ్రై స్పెల్స్ టైం పెరగడంతో ఫాల్ ఆర్మీవార్మ్ మరింత ఎక్కువగా విజృంభించి పలు రాష్ట్రాల్లో మొక్కజొన్నను బాగా నష్టపర్చిందని, వీటినీ దిగుమతి చేసుకోవాల్సి రావచ్చని పేర్కొంటున్నారు. ఉల్లి ఎగుమతుల్లో టాప్ దేశాల్లో ఒకటైన ఇండియా ఈసారి ఎగుమతులను ఆపేసిందని, దీనివల్ల బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ లో ఉల్లి రేట్లు డబుల్ అయ్యాయని చెబుతున్నారు.
యాసంగి పంటలకు మేలు..
ఖరీఫ్‌లో వానలు బాగా పడటం వల్ల ఈ రబీ సీజన్‌లో గోధుమ, ఆవ, శనగ పంటలకు మేలు కలగనుందని చెబుతున్నారు. రబీకి ముందు సెప్టెంబర్‌లో వానలు ఎక్కువగా పడ్డాయి. ఈసారి దేశంలోని చాలా రిజర్వాయర్లు పదేళ్లలో రికార్డును దాటి నిండాయి. నేలలో తేమ పెరగడంతో పాటు రిజర్వాయర్లలో నీరు ఉండటం వల్ల ఈసారి రబీ పంటల సాగు పెరగనుంది. ఈ రబీ లో దేశవ్యాప్తంగా గోధుమ, వరి దిగుబడి రికార్డు స్థాయిలో పెరుగుతుందని చెబుతున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్ కన్నా దేశంలో గోధుమ, వడ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల ఎగుమతి కష్టంగా మారుతుందని అంటున్నారు.
ఈ సారి ఏం జరిగింది?
సీజన్ మొదట్లో డ్రై స్పెల్ (రెండు వానలకు మధ్య ఉండే గ్యాప్) సమయం ఎక్కువ ఉండటంతో యావరేజ్ వర్షపాతం నమోదైంది. దీంతో దేశంలో చాలాచోట్ల పంటల సాగు ఆలస్యమైంది. కొన్ని చోట్ల ముందే వేసిన పంటలు ఎండిపోయాయి. ఎక్కువ కాలం ఉన్న ఆ డ్రై స్పెల్ పోయి ఒక్కసారిగా భారీ వానలు పడ్డాయి. దీంతో చాలాచోట్ల పంటలు మునిగాయి. కీటకాలు, తెగుళ్లు సోకి కూడా నష్టం జరిగింది. పురుగుమందుల కోసం రైతులు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది.