టార్గెట్ మండలి.. చేరికలే లక్ష్యంగా కాంగ్రెస్ ఆపరేషన్!

టార్గెట్ మండలి.. చేరికలే లక్ష్యంగా కాంగ్రెస్ ఆపరేషన్!
  • కండువాలు కప్పడంపైనే కాంగ్రెస్ నజర్
  • మల్లన్న గెలుపుతో 4కు చేరిన కాంగ్రెస్ బలం
  • కాంటాక్ట్ లోనే గుత్తా, బండా ప్రకాశ్ తదితరులు?
  • మరో ఐదుగురితోనూ నేతల సంప్రదింపులు!

హైదరాబాద్:కాంగ్రెస్ పార్టీ రూటు మార్చింది. అసెంబ్లీలో సరిపడా బలం ఉండటంతో ఈ సారి మండలిపై దృష్టి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 స్థానా ల్లో విజయం సాధించింది. మిత్రపక్షమైన సీపీఐ ఒక సెగ్మెంట్లో గెలిచింది. దీనికి తోడు ఇటీవల జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం సాధించడంతో కాంగ్రెస్, సీపీఐ బలం 66కు చేరింది.

కీలక బిల్లులు పాస్ కావాలంటే  మండలిలోనూ మెజార్టీ కావాలి. కానీ 40 మంది సభ్యులున్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం కేవలం నలుగురే. 21 మంది సభ్యు లుం టే ఈజీగా బిల్లులు పాసయ్యే అవకాశం ఉంది. ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడం, పలు చోట్ల డిపాజిట్లు కోల్పోవడం, 15 స్థానాల్లో మూడో స్థానానికి పడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో  నిస్తేజం అలుముకుంది.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీ అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్టాటజీ మార్చినట్టు తెలుస్తోంది. ముందుగా ఎమ్మెల్సీలను జాయిన్ చేసుకోవడంపైనే దృష్టి  సారించినట్టు సమాచారం. 40 మంది ఎమ్మెల్సీలు ఉన్న శాసన మండలిలో కాంగ్రెస్ బలం నాలుగు మాత్రమే! 2019 నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీగా టీ జీవన్ రెడ్డి కొనసాగుతుండగా, తాజాగా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్, బల్మూరి వెంకట్ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా గెలిచారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల సెగ్మెంట్ నుంచి ఇటీవలే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా గెలిచారు.  

దీంతో కాంగ్రెస్ బలం నాలుగుకు చేరింది. ఎంఐఎం, బీజేపీలకు ఒక్కో సభ్యుడు చొప్పున ఉన్నారు. మిగతా 34 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే కావడం గమనార్హం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ తో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. వీళ్లిద్దరూ కాంగ్రెస్ తో కాంటాక్ట్ లో ఉన్నారనేది బహిరంగ రహస్యమే. వీరిలో వచ్చే ఏడాది బస్వరాజ్ సారయ్య వచ్చే  ఏడాది రిటైర్ కాబోతున్నారు.

ఆయనకు రెన్యూవల్ కోసం ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సారయ్యతోపాటు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ తో సైతం సంప్రదింపులు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. మాజీ మంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే పలువురి ఎమ్మెల్సీలతో టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. బుగ్గారపు దయానంద్, ఎగ్గె మల్లేశం, శేరి సుభాష్ రెడ్డి పదవీకాలం మరో ఏడాదిలో ముగుస్తుండటంతో వారితోనూ టచ్ లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందామనే పనిలో కారు పార్టీ నాయకత్వం పడిందనే వాదన మరో వైపు వినిపిస్తోంది. ఏకంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టి ఆయనను తప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నట్టు మరో ప్రచారం ఉంది. ఏది ఏమైనా మండలి టార్గెట్ గా కాంగ్రెస్ పార్టీ చేసే ఆపరేషన్ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది.