నావి ముంబై: ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగుతోంది. మెగా లీగ్‌లో ఆర్సీబీ ఐదో విక్టరీ సాధించింది. . కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (64 బాల్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96) ధనాధన్ ఇన్నింగ్స్‌కు తోడు బౌలింగ్‌లో హేజిల్ వుడ్ (4/25) రాణించడంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను 18 రన్స్ తేడాతో చిత్తుచేసింది. తొలుత బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 181/6 స్కోర్ చేసింది. లక్నో బౌలర్లలో హోల్డర్ (2/25), చమీర (2/31) రెండేసి వికెట్లతో అలరించారు. అనంతరం ఛేజింగ్ లో ఓవర్లన్నీ ఆడిన లక్నో 163/8 స్కోరే చేసి ఓడింది. క్రునాల్ పాండ్యా (28 బాల్స్ లో5 ఫోర్లు, 2 సిక్సర్లతో 42) టాప్ స్కోరర్. డుప్లెసిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
డుప్లెసిస్ కెప్టెన్ ఇన్నింగ్స్
డుప్లెసిస్ తప్ప టాపార్డర్ విఫలమవడంతో ఫస్ట్ బ్యాటింగ్‌లో బెంగళూరు ప్రారంభంలోనే 7/2తో ఇబ్బందుల్లో పడింది. మొదటి ఓవర్లోనే అనూజ్ రావత్ (4), విరాట్ కోహ్లీ (0)ని ఔట్ చేసిన చమీర.. లక్నోకు సూపర్ బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత డుప్లె సిస్‌తో కలిసిన మ్యాక్స్ వెల్ (23) దూకుడు చూపించాడు. మూడో ఓవర్లో మూడు ఫోర్లతో పాటు ఓ సిక్స్ తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కానీ పవర్ ప్లే చివరి ఓవర్లో హోల్డర్ పట్టిన అద్భుత క్యాచ్‌కు మ్యాక్సీ ఔటవడంతో 47/3తో నిలిచిన ఆర్ సీబీ మరింత ఇబ్బందుల్లో పడింది. కాసేపటికే ప్రభు దేశాయ్ (10) వెనుదిరగ్గా.. డుప్లెసిస్, షాబాజ్ అహ్మద్ (26) మిడిల్లో ఇన్నింగ్స్‌ను గాడినపెట్టారు. వీరిద్దరూ జాగ్రత్తగా ఆడుతూనే వరుస బౌండ్రీలు కొట్టడంతో 12వ ఓవర్లో ఆర్ సీబీ స్కోర్ 100కు చేరింది. ఆ తర్వాతి ఓవర్లో సిక్స్ బాది సింగిల్‌తో
డుప్లెసిస్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.16వ ఓవర్లో షాబాజ్ రనౌట్ కావడంతో ఐదో వికెట్‌కు 70 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. ఈ దశలో కెప్టెన్ తో పాటు దినేశ్ కార్తీక్ (13 నాటౌట్) బ్యాట్ కు పనిచెప్పగా తర్వాతి రెండు ఓవర్లలో 27 రన్స్ వచ్చాయి. అయితే హోల్డర్ వేసిన చివరి ఓవర్లో క్యాచ్ ఔట్ గా వెనుదిరిగిన డుప్లెసిస్ కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ ఓవర్లో 4 రన్సే వచ్చాయి.
క్రునాల్ పోరాడినా..
భారీ టార్గెట్ ఛేజింగ్‌లో వరుసగా వికెట్లు కోల్పోయిన లక్నో పరాజయం మూటగట్టుకుంది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లతో కెప్టెన్ కేఎల్ రాహుల్ (30) జోరు మీద కనిపించాడు. కానీ మరో ఓపెనర్ డికాక్ (3), మనీశ్ పాండే (6)ను హేజిల్ వుడ్ వరుస ఓవర్లలో ఔట్ చేసి ఆ టీమ్‌ను దెబ్బకొట్టాడు. ఈ దశలో రాహుల్, క్రునాల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. క్రీజులో కుదురుకున్న రాహుల్.. ఎనిమిదో ఓవర్లో హర్షల్ వైడ్‌బాల్‌ను వెంటాడి కీపర్‌కు చిక్కడంతో లక్నో 64/3తో కష్టాల్లో పడింది. అనంతరం క్రునాల్‌కు దీపక్ హుడా (13) కాసేపు సపోర్ట్ ఇచ్చాడు. అయితే రెండు ఓవర్ల తేడాతో ఇద్దరూ వెనుదిరగడంతో మ్యాచ్ ఆర్సీబీ చేతుల్లోకి వెళ్లింది. బదోని (13), స్టోయినిస్ (24) కాసేపు బెంగళూరు బౌలర్లను కాచుకుని లక్నోను పోటీలో నిలిపినా.. 17, 19వ ఓవర్లో వీరిద్దరినీ హేజిల్‌వుడ్ ఔట్ చేయడంతో లక్నోకు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. చివరి ఓవర్లో లక్నోకు 31 రన్స్ అవసరం కాగా హోల్డర్ (16)ను ఔట్ చేసిన హర్షల్ 12 రన్సే ఇవ్వడంతో ఆర్ సీబీ గెలిచింది.

