టికెట్ల అమ్మకంతో మాకు సంబంధం లేదు : అజారుద్దీన్

టికెట్ల అమ్మకంతో మాకు సంబంధం లేదు : అజారుద్దీన్

ఈనెల 25న ఉప్పల్ స్టేడియంలో జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల అంశంతో తమకు సంబంధం లేదని హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ తేల్చి చెప్పారు. బ్లాక్ లో టికెట్లు అమ్మినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని, బ్లాక్ జరిగి ఉంటే పోలీసులు చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. ‘‘కాంప్లిమెంటరీ టికెట్లు ఎక్కువగా ఉన్నాయి. డౌటే లేదు. పేటీఎం ద్వారా బుకింగ్ కోసం 4వేల టికెట్లు ఇచ్చాం. ఆఫ్ లైన్ లో టికెట్ల జారీకి మరో 6వేల టికెట్లు ఇచ్చినం’’ అని వెల్లడించారు.  టికెట్ల ఇష్యూ, జింఖానా గ్రౌండ్ లో తొక్కిసలాట వ్యవహారంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో హెచ్సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ మాట్లాడారు.

మొత్తం 26 వేల టికెట్ల అమ్మకం

చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో టిక్కెట్లకు డిమాండ్ ఏర్పడిందన్నారు. ‘‘మేము టిక్కెట్లు బ్లాక్ చేయలేదు.. బ్లాక్‌లో అమ్మలేదు’’ అని చెప్పారు. జింఖానా దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసని, దానితో తమకు సంబంధం లేదన్నారు. అయితే గాయపడిన వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. సెప్టెంబరు 15న ఆన్ లైన్ ద్వారా 14,450 టికెట్లు, కార్పొరేట్ బాక్స్ ద్వారా 4000 , జింఖానాలో 2100, ఇంటర్నల్ గా 6000 టికెట్లు విక్రయించామని వివరించారు. మొత్తం 26,550 టికెట్ల అమ్మకం జరిగిందన్నారు. ‘‘మ్యాచ్ ను సక్సెస్ చేయడానికి చేయాల్సినవన్నీ చేశాం. ఇంతకంటే ఏం చేయాలి?  నేనేం తప్పు చేశానో చెప్పండి?’’ అజారుద్దీన్ వ్యాఖ్యానించారు.

హెచ్సీఏలో విభేదాలు వాస్తవమే : విజయానంద్

హెచ్సీఏలో విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని హెచ్సీఏ సెక్రెటరీ  విజయానంద్ ఈసందర్భంగా   అంగీకరించారు.   ‘‘మ్యాచ్ సక్సెస్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. అయితే కొవిడ్ కారణంగా తగినన్ని  ఫండ్స్ లేవు. ఉన్న నిధులతో ఏర్పాట్లు చేశాం’’ అని ఆయన చెప్పారు. బయటి ఏజెన్సీ పేటీఎంకు టికెట్లు అప్పగించాక.. అందులో ఏం జరిగితే తమకేం సంబంధం అని ఆయన ప్రశ్నించారు.