సీఐడీ కస్టడీకి హెచ్‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌ మోహన్‌‌ రావు టీమ్‌‌

సీఐడీ కస్టడీకి హెచ్‌‌సీఏ అధ్యక్షుడు జగన్‌‌ మోహన్‌‌ రావు టీమ్‌‌
  • ఆరు రోజుల కస్టడీకి అనుమతిచ్చిన కోర్టు
  • ఫోర్జరీ సంతకాలు, నిధుల గోల్‌‌మాల్‌‌, టికెట్ల వివాదంపై ప్రశ్నించనున్న సీఐడీ

హైదరాబాద్‌‌, వెలుగు: హైదరాబాద్‌‌ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ) కేసులో అధ్యక్షుడు జగన్‌‌మోహన్ రావు సహా ఐదుగురు నిందితులను మేడ్చల్ మల్కాజ్​గిరి జిల్లా కోర్టు సీఐడీ కస్టడీకి అనుమతి ఇచ్చింది. గురువారం నుంచి ఈ నెల 22 వరకు ఆరు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారించాలని ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఫోర్జరీ కేసుతో పాటు ఐపీఎల్‌‌ టికెట్ల వివాదం,హెచ్‌‌సీఏ నిధుల గోల్‌‌మాల్‌‌కు సంబంధించి  జగన్‌‌మోహన్‌‌రావు, ట్రెజరర్‌‌‌‌ జేఎస్‌‌ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్‌‌ కాంటె, శ్రీచక్ర క్రికెట్‌‌ క్లబ్‌‌ జనరల్‌‌ సెక్రటరీ రాజేందర్‌‌ యాదవ్‌‌ ఆయన భార్య శ్రీచక్ర క్రికెట్‌‌క్లబ్‌‌ అధ్యక్షురాలు కవితను ఈ నెల 9న సీఐడీ అరెస్ట్‌‌ చేసిన సంగతి తెలిసిందే. 

ఈ కేసులో నిందితుల నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు, పలు సాక్ష్యాధారాలు సేకరించేందుకు 10 రోజుల పాటు కస్టడీకి అనుమతి కోరుతూ సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌‌పై కోర్టు విచారణ జరిపింది. ఆరు రోజుల పాటు కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో చంచల్‌‌గూడ మహిళా జైలులో ఉన్న కవితను, చర్లపల్లి జైలులో ఉన్న జగన్‌‌మోహన్‌‌రావు సహా నలుగురు నిందితులను సీఐడీ అధికారులు గురువారం ఉదయం తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. జైలు నుంచి రెడ్‌‌హిల్స్‌‌లోని సీఐడీ రీజినల్ ఆఫీస్‌‌కు తరలించి విచారించనున్నారు.