
- సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీలో హెచ్సీయూకు 335వ స్థానం
హైదరాబాద్, వెలుగు: క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2026లో మన రాష్ట్రానికి చెందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) చోటుదక్కించుకున్నాయి. గురువారం విడుదలైన ర్యాంకింగ్స్లో భారత్ నుంచి మొత్తం 54 విద్యాసంస్థలు సత్తాచాటాయి. గత ఏడాది ఈ సంఖ్య 46గా ఉంది. ఈసారి ప్రపంచవ్యాప్తంగా 8,467 సంస్థలు పోటీపడగా.. 106 దేశాల నుంచి 1,501 సంస్థలకు ర్యాంకులు కేటాయించారు.
అకడమిక్ రెప్యుటేషన్, ఎంప్లాయర్ రెప్యుటేషన్, సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ, ఫ్యాకల్టీ-స్టూడెంట్ రేషియో, సస్టైనబిలిటీ, ఇంటర్నేషనల్ రీసెర్చ్ నెట్వర్క్ వంటి కొలమానాల ఆధారంగా ర్యాంకింగ్స్ రూపొందించారు. గత ఐదేండ్లల్లో ప్రచురిత పేపర్ల సంఖ్య, ఆ పేపర్లకు ఆరేండ్లలో వచ్చిన సైటేషన్ల ఆధారంగా డేటా సేకరించారు. తెలంగాణ నుంచి హెచ్సీయూ ప్రపంచవ్యాప్తంగా 801–850 స్థానంలో నిలిచింది. ‘సైటేషన్స్ పర్ ఫ్యాకల్టీ’ సూచికలో 335వ ర్యాంకును సాధించింది.
ఐఐటీహెచ్ 664వ స్థానంలో నిలిచింది. ఈ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీ (123వ ర్యాంకు), ఐఐటీ బాంబే (129), ఐఐటీ మద్రాస్ (180) టాప్-200లో ఉన్నాయి. దీనిపై హెచ్సీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బీజే రావు హర్షం వ్యక్తం చేశారు. పరిశోధనలో విశ్వవిద్యాలయం బలమైన పునాది వేసిందని తెలిపారు. అయితే, రాష్ట్రం నుంచి ర్యాంకులు సాధించిన రెండు సంస్థలూ కేంద్ర విద్యాసంస్థలే కావడం గమనార్హం.