హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ లాభం రూ.18, 654 కోట్లు.. వడ్డీ ఆదాయం రూ.32,620 కోట్లు

 హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ లాభం రూ.18, 654 కోట్లు.. వడ్డీ ఆదాయం రూ.32,620 కోట్లు

న్యూఢిల్లీ: హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌కు కిందటేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌తో ముగిసిన క్వార్టర్ (క్యూ3) లో రూ.18,654 కోట్ల నికర లాభం  వచ్చింది. ఇది అంతకుముందు సంవత్సరంలోని ఇదే కాలంలో వచ్చిన రూ.16,736 కోట్లతో పోలిస్తే 11.5శాతం ఎక్కువ. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.19,807 కోట్ల నికర లాభాన్ని సాధించింది.  ఆదాయం, డిపాజిట్లు పెరగడం, ఆస్తుల నాణ్యత స్థిరంగా ఉండటంతో బ్యాంక్ ప్రాఫిట్ దూసుకుపోయింది.  అయితే వడ్డీ మార్జిన్లు కొంత ఒత్తిడిలో ఉన్నాయి.  

హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌కి క్యూ3లో రూ.32,620 కోట్ల వడ్డీ ఆదాయం వచ్చింది. 2024 డిసెంబర్ క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో వచ్చిన రూ.30,650 కోట్ల ఆదాయంతో పోలిస్తే  6.4శాతం  పెరిగింది. వడ్డీ మార్జిన్ 3.51శాతంగా ఉంది. బ్యాంక్ అసెట్ క్వాలిటీ క్యూ3లో నిలకడగా ఉంది.  గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల విలువ రూ.36,019 కోట్ల నుంచి  రూ.35,179 కోట్లకు తగ్గింది.  గ్రాస్ ఎన్‌‌‌‌పీఏల రేషియో  1.42 శాతం నుంచి1.24 శాతానికి మెరుగుపడింది.   నెట్‌‌‌‌ ఎన్‌‌‌‌పీఏల విలువ  రూ.11,982 కోట్లుగా, నెట్‌‌‌‌ ఎన్‌‌‌‌పీఏల రేషియో  0.42శాతం ఉంది.  

బ్యాంక్‌‌‌‌  ఖర్చులు క్యూ3లో  రూ.18,770 కోట్లకు చేరాయి. కొత్త లేబర్ కోడ్స్ ప్రభావం వలన రూ.800 కోట్లు అదనంగా ఖర్చు అయ్యాయి.  ఈసారి హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌ డిపాజిట్లు ఏడాది లెక్కన 11.6 శాతం పెరిగి రూ.28.6 లక్షల కోట్లకు ఎగిశాయి.  బ్యాంక్‌‌‌‌ ఇచ్చిన అప్పుల విలువ 11.9 శాతం వృద్ధి చెంది  రూ.28.45 లక్షల కోట్లుగా  నమోదయ్యాయి.