ఆస్పత్రి ఖర్చులకు లోన్లు ఇవ్వనున్నహెచ్​డీఎఫ్‌‌సీ

ఆస్పత్రి ఖర్చులకు లోన్లు ఇవ్వనున్నహెచ్​డీఎఫ్‌‌సీ

అపోలోతో హెచ్​డీఎఫ్‌‌సీ బ్యాంక్​ ఒప్పందం

రూ.40 లక్షల వరకు లోన్ పొందవచ్చు

కార్డులపై నో కాస్ట్ ఈఐఎం సదుపాయం

హైదరాబాద్, వెలుగు: తమ కస్టమర్ల ట్రీట్‌‌మెంట్ ఖర్చుల కోసం లోన్లు ఇవ్వడానికి హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంకు అపోలో హాస్పిటల్స్‌‌తో చేతులు కలిపింది. ఇందుకోసం రెండు సంస్థలు కలిపి ‘ది హెల్తీలైఫ్ ప్రోగ్రామ్’ను ప్రారంభించాయి. హెచ్‌‌డీఎఫ్‌‌సీ ఎండీ ఆదిత్య పురి, అపోలో గ్రూపు చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ వైస్‌‌ చైర్మన్ కామినేని శోభన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  అపోలో 24/7 ద్వారా బ్యాంకు కస్టమర్లు ఎప్పుడైనా అపోలో డాక్టర్ల సేవలను ఆన్‌‌లైన్‌‌లో ఉచితంగా పొందవచ్చు. అపోలో హాస్పిటల్‌‌లో ఇన్‌‌పేషెంట్‌‌గా చేరితే వైద్యం, ఇతర ఖర్చుల కోసం ఆన్‌‌లైన్‌‌లోనే బ్యాంకు లోన్‌‌కు అప్లై చేసుకోవచ్చు. ఒక్కో పేషెంటుకు రూ.40 లక్షల వరకు లోన్ ఇస్తారు. అర్హులైన కస్టమర్లకు పది నిమిషాల్లో లోన్ వస్తుంది. ‘‘ఆరోగ్యం కంటే విలువైనది ఏమీ లేదు. మనదేశం ఎదగాలంటే అందరం ఆరోగ్యంగా ఉండాలి. అపోలోతో జోడీ కట్టడం ఒక మిషన్ వంటిదని నేను అనుకుంటున్నాను. దీనివల్ల లక్షలాది మందికి సులభంగా మెడికల్ లోన్స్ వస్తాయి.  మా వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. వాయిదాల్లో చెల్లించవచ్చు. ఆన్‌‌లైన్‌‌లోనే లోన్‌‌కు అప్లై చేసుకోవచ్చు. బ్రాంచ్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మా కస్టమర్లు తమకు ఇష్టమొచ్చిన చోట వైద్యం చేయించుకోవచ్చు. నేషనల్ డిజిటల్ మిషన్ ద్వారా అందరికీ మెరుగైన వైద్యం అందించాలన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలే మాకు స్పూర్తి” అని ఆదిత్య పురి అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా హెల్త్‌‌కేర్, ఫైనాన్షియల్ సెక్టార్‌‌‌‌లో అద్భుతమైన మార్పులు వస్తాయని ప్రతాప్ రెడ్డి అన్నారు.