కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు కూడా.. అందలం ఎక్కిస్తాయి.. ఈ నటుడి ప్రయాణమే నిదర్శనం !

కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు కూడా.. అందలం ఎక్కిస్తాయి.. ఈ నటుడి ప్రయాణమే నిదర్శనం !

సినిమాలు చేయాలని ఎప్పటినుంచో కలలు కంటూ కొన్నేండ్లకు వాటిని సాకారం చేసుకునేవాళ్లుంటారు. కానీ, కొందరు మాత్రం వాళ్లు అసలు ఊహించని విధంగా తన కెరీర్​ను మలుచుకుంటారు. పేరెంట్స్ కోసం తమ డ్రీమ్ వదిలేసి వాళ్ల కోరిక తీర్చేందుకు సిద్ధమవుతారు. ఎవరైనా సరే.. కష్టపడితే సక్సెస్ వస్తుంది. ఎవరి కల అయినా నెరవేరుతుంది. కొన్నిసార్లు అనుకోని నిర్ణయాలు కూడా అందలాన్ని ఎక్కిస్తాయి అనడానికి ఈ నటుడి ప్రయాణమే నిదర్శనం. అతనెవరో కాదు.. బాలీవుడ్లో ఇప్పుడిప్పుడే స్టార్గా ఎదుగుతోన్న లక్ష్య.

ఢిల్లీకి చెందిన లక్ష్య లల్వాని.. 2023లో బాలీవుడ్​లో ‘కిల్’ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఆ సినిమాలో అమ్రిత్ రాథోడ్ పాత్రలో నటించి మెప్పించిన లక్ష్య.. బెస్ట్​ మేల్ డెబ్యూ స్టార్​గా ఐఫా అవార్డు అందుకున్నాడు. అయితే అంతకంటే ముందే 2015లో లక్ష్య ‘వారియర్ హై’ అనే సీరియల్​లో నటించాడు. ఆ తర్వాత కూడా వరుసగా ‘అధురి కహానీ హమారీ’, ‘ప్యార్ తునే క్యా కియా’, ‘పార్దెస్ మే హై మేరా దిల్’, ‘పోరుస్​’ వంటి సిరీస్​ల​లో నటించాడు. షారుఖ్​ ఖాన్ కొడుకు ఆర్యన్ డైరెక్షన్​లో రీసెంట్​గా వచ్చిన ‘ది బ్యాడ్స్​ ఆఫ్​ బాలీవుడ్’ అనే సిరీస్​లో కనిపించాడు. లక్ష్య కరణ్​ జోహార్ ధర్మ ప్రొడక్షన్స్​లో మూడు సినిమాలకు సైన్ చేశాడు. దాంతో అప్పటికే హిందీ సినిమాలో తనకు గ్రాండ్ వెల్కమ్ దక్కింది.

ఆర్మీలో చేరాలనుకున్నా..
నేను ఇండియన్​ ఆర్మీలో చేరాలనుకున్నా. సినిమాల్లో నటించాలనేది నా డ్రీమ్​ కాదు. సరదాగా తిరిగామా.. సినిమాలకెళ్లామా.. అన్నట్టు ఉండేది నా లైఫ్​. ఒక ఆడిషన్​ తర్వాత ‘వారియర్ హై’ అనే సీరియల్​ నా కెరీర్​ను మలుపుతిప్పింది. చదువుకునే రోజుల్లో ఎప్పుడూ యాక్టర్ కావాలనుకోలేదు. ఎన్​డీఎ(నేషనల్​ డిఫెన్స్​ అకాడమీ)లో చేరేందుకు ప్రిపేర్ అవుతున్నా. ప్రిలిమినరీ ఎగ్జామ్ పూర్తి చేశా. కానీ, అమ్మ నన్ను యాక్టింగ్ కెరీర్​లోకి వెళ్లేలా ప్రోత్సహించింది. తన కోసం ఏదైనా చేస్తానని అప్పుడే మాటిచ్చా. నా లైఫ్​లో తనే నాకు పెద్ద మోటివేషన్​. మా నాన్న కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తారు. యాక్టింగ్​లోకి అవకాశం ఎలా వచ్చిందంటే.. ఢిల్లీలో ఉన్నప్పుడు ఆడిషన్​కు వెళ్లా. అప్పటికే నేను జిమ్​ ట్రైనర్​గా జాబ్ చేసేవాడిని. ఆడిషన్​లో సెలక్ట్ కావడంతో ముంబై వెళ్లే చాన్స్ వచ్చింది, డబ్బులు కూడా ఇస్తారని వెంటనే జాబ్ మానేసి వెళ్లిపోయా. అప్పట్లో నాకు అసలు యాక్టింగ్ రాదు. దాంతో హేళన చేసేవాళ్లు.

టీవీలో నటించేటప్పుడు..
ఒక సీరియల్​లో అవకాశం రావడంతో వెంటనే మా నాన్నకు ఫోన్​ చేసి రోజుకు కొంత అమౌంట్ ఇస్తారని చెప్పాను. నాన్న అందుకు ఏం అడ్డు చెప్పలేదు. సరే మంచిదే కదా చెయ్యమన్నారు. ‘పోరస్’ అనే సిరీస్​ చేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడ్డా. అందులో నా క్యారెక్టర్ కింగ్​లా ఉంటుంది. అందులో అన్ని రకరకాల ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. యాక్షన్ సీన్స్ ఉన్నాయి. లొకేషన్​ కూడా వేరే చోట కావడంతో నా హెల్త్ కొంచెం పాడైంది. అప్పుడు నన్ను కాస్ట్​ చేసిన కాస్టింగ్​ డైరెక్టర్​కి ఫోన్ చేసి చెప్తే ఆమె ఒక డాక్టర్ నెంబర్ ఇచ్చింది. వెళ్లి చెక్​ చేయించుకుంటే కంటికి సంబంధించిన అరుదైన వ్యాధి అని చెప్పారు. అయితే, అది ఎందుకు వచ్చింది అని కనుక్కుంటే నాకు హెల్త్ పాడైనా, యాంటీబయాటిక్స్ వేసుకుంటూ రోజుకు 12 గంటలు షూటింగ్, 2 గంటలు జిమ్ చేస్తూ ఉండడం వల్ల బాడీలో రియాక్షన్ వచ్చింది. దాంతో హాస్పిటల్​లో చేరాల్సి వచ్చింది.

‘కిల్’ తర్వాత..
‘కిల్​’ సినిమా షూటింగ్​లో ప్రతి రోజూ దెబ్బలు తగిలేవి. నిజంగా రక్తం కారుతుందా? నకిలీదా? అనేది కూడా అర్థమయ్యేది కాదు. రోజూ ఒళ్లు అలసిపోయేలా కష్టపడేవాళ్లం. ఒకరోజు సెలవు దొరికితే బాగుండు.. ఇంటికెళ్లాలి.. రెస్ట్ తీసుకోవాలి అనిపించేది. షూటింగ్ జరిగినన్ని రోజులూ నా ఫ్రెండ్స్ని కూడా కలవలేదు. ఒక్కసారి సినిమా రిలీజ్​ అయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చాక, నా యాక్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన రెస్పాన్స్ మర్చిపోలేను. ఈ సినిమా కోసం బాడీ ట్రాన్స్​ఫర్మేషన్ చేశా. ఇందులో షర్ట్ తీసేసి చేయాల్సిన షాట్ కోసం బాడీ బిల్డ్ చేసుకోవాలి అనుకున్నా. నేను జిమ్​లో పనిచేసినా ఇలా ఉండాలి అని పర్టిక్యులర్​గా ఏం అనుకోలేదు. సినిమాల్లో అలా ఉండదు. ఏదైనా పర్ఫెక్ట్​గా చేయాల్సి ఉంటుంది. ఒక క్యారెక్టర్​ ఎలా డిజైన్ చేస్తే అలానే కనిపించాలి. ఆ విషయం అర్థం చేసుకుని బాడీని ఒక షేప్​లో ఉంచే ప్రయత్నం చేశా. 

ఏది వచ్చినా..
సినిమా ద్వారా నాకు గుర్తింపు, డబ్బు, సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఏది వచ్చినా దాన్ని రిసీవ్ చేసుకోవాలి. అన్నింటికీ రెడీగా ఉండాలి. హడావిడి లేకుండా కూర్చుని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎంత కష్టపడితే అంత సక్సెస్ వస్తుంది. కాబట్టి కష్టపడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. సక్సెస్ వచ్చేవరకు సహనంతో ఉండాలి.

ఇంటి పేరు తీసేశా..
ఇంటిపేరు తీసేయమని నాకెవరూ చెప్పలేదు. నన్ను ఎవరూ ఒత్తిడి చేయలేదు. న్యూమరాలజీ కోసం కూడా కాదు. నేను అలాంటివి నమ్మను కూడా. డెస్టినీ, హార్డ్ వర్క్​ను నమ్ముతా. ఇంటిపేరు వల్ల సొసైటీలో డిఫరెన్సెస్​ వస్తుంటాయి. అదే ఇంటిపేరు తీసేస్తే ఒకే ప్లాట్​ఫామ్​ మీద ఎవరిని వాళ్లు వెతుక్కుంటారు. ఇది ఐకమత్యంగా ఉండడానికి బలం చేకూరుస్తుందని నమ్మా. అందుకే నా అంతట నేనే ఇంటిపేరు తొలగించాలనుకున్నా.