పరిహారం కోసం కోర్టుకెక్కితే ఫైన్.. యువకుడికి సుప్రీం మొట్టికాయలు!!

పరిహారం కోసం కోర్టుకెక్కితే ఫైన్.. యువకుడికి సుప్రీం మొట్టికాయలు!!

గూగుల్ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలంటూ దావా వేసిన ఓ వ్యక్తికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. ఆ పిటిషన్ ను కొట్టివేయడంతో పాటు అతడిపైనే 25 వేల రూపాయల జరిమానా విధించింది. ఇంతకీ అతడు సుప్రీంకోర్టులో దావా ఎందుకు వేశాడు ? సుప్రీంకోర్టు ఎందుకు చివాట్లు పెట్టింది ? అనే విషయాలు తెలియాలంటే వార్త మొత్తం చదవాల్సిందే. 

మధ్యప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు ఇటీవల ఒక పోటీ పరీక్ష రాసి, అర్హత సాధించలేకపోయాడు. గూగుల్ కు చెందిన యూట్యూబ్ లో తాను చూసిన కొన్ని అడ్వర్టయిజ్మెంట్ల వల్లే ఎగ్జామ్ లో నెగ్గలేకపోయానని భావించాడు. అంతటితో ఊరుకోకుండా ఇదే అభియోగాన్ని యూట్యూబ్ పై మోపుతూ సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. యూట్యూబ్ అడ్వర్టయిజ్మెంట్ చూసి సమయం వృథా చేసుకొని సరిగ్గా పోటీ పరీక్షకు ప్రిపేర్ కాలేకపోయానని, ఫలితంగా ఉద్యోగ రేసులో విఫలమయ్యానని చెబుతూ వాదనలు వినిపించాడు. ఇందుకుగానూ గూగుల్ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు. 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్  ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకా లతో కూడిన ధర్మాసనం పిటిషనర్ వాదనతో విభేదించింది. ‘‘ అడ్వర్టయిజ్మెంట్ ను చూసి పోటీ పరీక్షల ప్రిపరేషన్ పై శ్రద్ధ లేకుండా పోయిందని ఆరోపించడం సరికాదు. ఆ అడ్వర్టయిజ్మెంట్ ను చూడమని మీకెవరూ చెప్పలేదే ? దాన్ని మీరు చూడకుండా ఉండాల్సింది. ఇది దారుణమైన పిటిషన్.  ఇలాంటి పిటిషన్ల వల్లే న్యాయ వ్యవస్థ విలువైన సమయం వృథా అవుతోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో అశ్లీలతను నిషేధించాలని కూడా ఆ వ్యక్తి తన పిటిషన్ లో కోరడం గమనార్హం. 

కాగా, సుప్రీంకోర్టు అతడికి తొలుత లక్ష రూపాయల జరిమానా విధించింది. అయితే తాను నిరుద్యోగినని అంత జరిమానా కట్టలేనని విజ్ఞప్తి చేయడంతో.. జరిమానా మొత్తాన్ని లక్ష నుంచి 25వేల రూపాయలకు తగ్గించారు.