గిరిజనులకు ఆయనే దేవుడు

గిరిజనులకు ఆయనే దేవుడు

హైదరాబాద్‌‌, వెలుగు: సంత్‌‌ సేవాలాల్‌‌ మహరాజ్‌‌, కుమ్రం భీమ్ స్థాయిలో సీఎం కేసీఆర్‌‌ కూడా గిరిజనుల గుండెల్లో నిలిచిపోతారని మంత్రి సత్యవతి రాథోడ్‌‌ అన్నారు. గిరిజన బంధు ఇస్తూ, రిజర్వేషన్లు పెంచి, పోడు సమస్యకు పరిష్కారం చూపుతున్న కేసీఆర్ ను.. సేవాలాల్, కుమ్రం భీమ్ లను కొలుచుకున్నట్టే గిరిజనులు కొలుచుకుంటారని చెప్పారు. ఆయనే గిరిజనుల దేవుడని అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో గిరిజన ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సత్యవతి మీడియాతో మాట్లాడారు. ‘‘ఇందిరాగాంధీ గరీబీ హఠావో అని నినాదమిచ్చి ఎస్సీ, ఎస్టీలకు ఇండ్లు, రేషన్‌‌ కార్డులు ఇస్తే... ఇన్నేండ్లు ఆమెను, కాంగ్రెస్ ను ఆయా వర్గాలు గుండెల్లో పెట్టుకున్నాయి.

ఇందిరాగాంధీ నినాదమిచ్చి ఇన్నేండ్లయినా పేదరికం తగ్గలేదు. ఇప్పుడు పేదరికాన్ని రూపుమాపేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం కేసీఆర్‌‌ అనేక పథకాలు ప్రవేశపెట్టారు. అడుగకముందే మా జాతికి ఎన్నో ఇచ్చిన కేసీఆర్‌‌కు జీవితాంతం రుణపడి ఉంటాం” అని చెప్పారు. కాంగ్రెస్‌‌ గరీబీ హఠావో అంటే.. బీజేపీ గరీబోంకో హఠావో అన్నట్టుగా దాడులకు పాల్పడుతోందని ఆమె విమర్శించారు. వానాకాలం వచ్చిందంటే భద్రాచలం, ఆదిలాబాద్‌‌ ఏజెన్సీలు రోగాలతో మంచం పట్టేవని.. ఏజెన్సీ గ్రామాలకు శుద్ధి చేసిన నీళ్లిచ్చి రోగాల నుంచి కాపాడిన దేవుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్‌‌ రేగా కాంతారావు అన్నారు. దేశంలోని గిరిజనులందరికీ న్యాయం జరగాలంటే కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాలని ఎంపీ మాలోతు కవిత అన్నారు. గిరిజనులు ఎన్నో రోజులుగా ఎదుర్కొంటున్న సమస్యలకు ఒకే ఒక్క రోజులో కేసీఆర్ పరిష్కారం చూపించారని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్‌‌ నాయక్‌‌ అన్నారు.