అంబులెన్స్ ఆలస్యం...చిన్నారి మృతి

 అంబులెన్స్ ఆలస్యం...చిన్నారి మృతి

అశ్వరావుపేట, వెలుగు: అనారోగ్యంగా ఉన్న చిన్నారిని మరో హాస్పిటల్​కు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులు అంబులెన్స్​కోసం ఆరు గంటలు వేచి చూశారు. అప్పటికీ అంబులెన్స్​రాలేదు కానీ ఆలోపే చిన్నారి మృతిచెందాడు. తల్లిదండ్రుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం దబ్బతోగు గ్రామానికి చెందిన ముఖేశ్, రావులమ్మ దంపతులకు రెండు నెలల బాబు ఉన్నాడు. చిన్నారికి కడుపులో నొప్పి రావడంతో సోమవారం ఉదయం 8 గంటలకు అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షలు చేసిన డాక్టర్ అనుదీప్ మెరుగైన ట్రీట్​మెంట్​కోసం కొత్తగూడెం తీసుకెళ్లమన్నారు. అంబులెన్స్ వస్తుందని, వెయిట్​చేయాలని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలైనా అంబులెన్స్ రాలేదు. పరిస్థితి విషమించడంతో బాబు మృతిచెందాడు. అంబులెన్స్ కోసం ఆగమని డాక్టర్ చెప్పడం వల్లే తాము వేచి చూశామని, బాబు మృతికి డాక్టరే కారణమంటూ తల్లిదండ్రులు, బంధువులు హాస్పిటల్ గేటు ముందు ఆందోళనకు దిగారు. ఏఎస్సై రెహమాన్ ఘటనా స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడారు. దాంతో ఆందోళన విరమించిన బాధితులు డాక్టర్ పై పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.