ఎప్పుడైనా బుల్లెట్ దిగొచ్చు.. జాగ్రత్త: ఎల్వీష్ యాదవ్ ఇంట్లో కాల్పులకు భావు గ్యాంగ్ బాధ్యత

ఎప్పుడైనా బుల్లెట్ దిగొచ్చు.. జాగ్రత్త: ఎల్వీష్ యాదవ్ ఇంట్లో కాల్పులకు భావు గ్యాంగ్ బాధ్యత

న్యూఢిల్లీ: యూట్యూబర్, బిగ్ బాస్ ఓటీటీ విజేత ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల ఘటనకు భావు గ్యాంగ్ బాధ్యత వహించింది. ఎల్వీష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిపింది తామేనని ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ఫ్లాట్‎ఫామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టింది. 

‘‘ఇవాళ ఎల్వీష్ యాదవ్ ఇంటిపై కాల్పులు జరిగాయి. నీరజ్ ఫరీద్‌పూర్, భావు రిటోలియా గ్యాంగ్ ఈ కాల్పులు జరిపించింది. ఎల్వీష్ యాదవ్ అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించి ఎన్నో ఇళ్లను నాశనం చేశాడు. ఎల్విష్ యాదవ్ వంటి సోషల్ మీడియాలోని చీడపురుగులకు ఇది ఒక హెచ్చరిక. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తే ఎప్పుడైనా బుల్లెట్ దిగొచ్చు. అప్రమత్తంగా ఉండండి’’ అని పేర్కొన్నారు. గ్యాంగ్‌స్టర్లు హిమాన్షు భావు, నీరజ్ ఫరీద్‌పురియా విదేశాల్లో నివసిస్తున్నారు. వీరు పోర్చుగల్‎లో ఉన్నట్లు సమాచారం. 

కాగా, ఆదివారం (ఆగస్ట్ 17) ఉదయం 6 గంటల ప్రాంతంలో హర్యానా గురుగ్రామ్‎లో ఉన్న ఎల్వీష్ యాదవ్ నివాసంపై గుర్తు తెలియని దుందగులు కాల్పుల జరిపారు. ఈ సమయంలో ఎల్వీష్ ఇంట్లో లేడు. అతడి కుటుంబ సభ్యులు మాత్రమే ఇంట్లో ఉన్నారని పోలీసులు తెలిపారు. దుండగులు 12 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ పుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.