
పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న ఉద్యోగం మానేశాడు ఆయన. ప్లాస్టిక్ రహిత సమాజమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. గ్రామాలు తిరుగుతూ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహాన కల్పిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు గుప్తాపై ప్రత్యేక కథనం. ప్రతి జీవికీ జీవనాధారం ప్రకృతి. ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిది. కానీ,మనం చేస్తున్న ప్రతి పని పర్యావరణానికి హాని కలిగిస్తూనే ఉన్నాయి. పర్యావరణ పరిరక్షణ అనేది నినాదంలా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగం కావాలి అంటారు సురేష్ గుప్తా. దీనికోసమే బ్యాంకు మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. మిత్రులు, బంధువులు వద్దని చెప్పినా ఈయనవెనక్కి తగ్గలేదు. నిత్యం చేతిలో ప్లాస్టిక్ రహిత వస్తువులను పట్టుకుని.. ఎక్కడికి వెళ్లినా వాటిటనే ఉపయోగిస్తూ.. పలువురికి పంచుతుంటారు. వాటిని ఉపయోగించాలని చెప్తారు గుప్తా. చేనేత వస్త్రాలను ధరిస్తూ, సేంద్రియ వ్యవసాయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అనేక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వ్యర్థాలను సేకరించే వారిని పర్యావరణ వేత్తలుగా భావించి వారిని సన్మానిస్తుంటారు.
చిన్నారులకు విద్యార్థి దశ నుంచే పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ.. వారిని పర్యావరణ ప్రేమికులుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు సురేష్ గుప్తా. ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ముప్పన్న విషయాన్ని అందిరికీ వివరిస్తుంటారు సురేష్ గుప్తా. ప్లాస్టిక్ రహిత వస్తువుల వినియోగంపై జనాలకు నిత్యం అవగాహన కల్పిస్తున్నారు. మాంసం దుకాణాల దగ్గరకు వెళ్లి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దని చెప్తారు. దుకాణాల దగ్గరికి వచ్చే వారికి టిఫిన్ బాక్సులు పంపిణీ చేస్తారు. పర్యావరణహిత బ్యాగులను పంపిణీ చేస్తుంటారు.విద్యార్థులకు, ఉద్యోగులకు, ప్రజలకు వీటిని అందజేసి.. ప్లాస్టిక్ వాడొద్దని చెబుతుంటారు. చిన్నారులను మార్చితే సమాజం దానంతట అదే బాగుపడుతుంది అనేది సురేష్ గుప్త నమ్మకం. అందుకే విద్యార్థులను ఎంచుకుని వారికి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు. మొక్కలు పంపిణీ చేసి.. వాటిని పెంచే బాధ్యత విద్యార్థులకు అప్పగిస్తారు. పాఠశాలల్లో విద్యార్థులకు పర్యావరణంపై డ్రాయింగ్ కాంపిటీషన్ ఏర్పాటు చేసి.. విజేతలకు బహుమతులు అందజేస్తారు. పర్యావరణ రక్షణ కోసం పనిచేస్తున్న సురేష్ గుప్తను ప్రజలు అభినందిస్తున్నారు.