
- రూ. కోటి విలువైన కరెన్సీ నోట్లు కూడా ఎత్తుకెళ్లిన దుండగులు
బెంగళూరు: కర్నాటకలోని విజయపుర జిల్లాలోని చడచన్ సిటీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాఖలో భారీ చోరీ జరిగింది. మంగళవారం సాయంత్రం ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు ఆర్మీ యూనిఫాంలో బ్యాంకులోకి ప్రవేశించారు. బ్యాంక్ సిబ్బందిని బెదిరించి దాదాపు 20 కిలోల బంగారం (20 కోట్ల రూపాయల విలువ), 1 కోటి రూపాయలతో పరారయ్యారు. పోలీసుల ప్రకారం..ముగ్గురు దుండగులు బ్యాంకులోకి ప్రవేశించి..కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నట్లు నటించారు.
సడెన్ గా తుపాకులు, కత్తులు బయటకు తీసి బ్యాంక్ మేనేజర్, క్యాషియర్‌తో సహా ఐదుగురు సిబ్బంది, నలుగురు కస్టమర్ల చేతులు, కాళ్లు ప్లాస్టిక్ ట్యాగ్‌లతో కట్టేశారు. కొందరిని టాయిలెట్‌లో బంధించారు. "డబ్బు తీయకపోతే చంపేస్తాం" అని మేనేజర్‌ను బెదిరించి నగదు, బంగారం లాకర్లను తెరిపించారు. 20 కోట్ల విలువైన గోల్డ్, కోటి రూపాయల
నగదును తమ బ్యాగుల్లో వేసుకుని పరారయ్యారు.
పోలీసు దర్యాప్తు
సమాచారం అందిన వెంటనే విజయపుర ఎస్పీ లక్ష్మణ్ నింబర్గి నేతృత్వంలోని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, ఫింగర్‌ప్రింట్ నిపుణులు కూడా ఆధారాలు సేకరించారు. దొంగలు సుజుకీ వాహనంలో నకిలీ నంబర్ ప్లేట్‌తో మహారాష్ట్ర సరిహద్దు వైపు పరారయ్యారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.