
మంచిర్యాల, వెలుగు: రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. మంచిర్యాల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన వేముల లక్ష్మీనారాయణ(42) కుటుంబ కలహాలతో మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం సాయంత్రం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోడానికి ప్రయత్నించాడు. రైల్వే ట్రాక్‌పై ఉన్న లక్ష్మీనారాయణను అక్కడే ఉన్న ఓ వ్యక్తి గమనించి 100కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. స్పందించిన మంచిర్యాల సీఐ ముత్తి లింగయ్య, ఎస్సై ప్రవీణ్ కుమార్ ఫోన్‌కాల్ లొకేషన్ఆధారంగా సుమారు రెండు కి.మీ. మేర పట్టాలపై పరిగెత్తి ఆత్మహత్యకు యత్నిస్తున్న వ్యక్తి వద్దకు చేరుకున్నారు. ఆ వ్యక్తి బాగా తాగి ఉండటంతో పోలీసులతో రావడానికి నిరాకరించాడు. అక్కడికి వెహికల్ తీసుకెళ్లే అవకాశం కూడా లేకపోవడంతో సీఐ గన్‌మన్ భరత్ సుమారు రెండు కి.మీ. వరకు ఆ వ్యక్తిని భుజాలపై మోసుకొని పట్టాలపై నడుచుకుంటూ తీసుకువచ్చాడు. అనంతరం కుటుంబసభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చి ఆసుపత్రిలో చేర్పించారు.