కేసీఆర్.. వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు

 కేసీఆర్.. వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు


మక్తల్/నర్వ, వెలుగు: రైతులు వరి వేస్తే ఉరేనన్న మహానుభావుడు సీఎం కేసీఆర్ అని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శించారు. రైతులను రాజులను చేస్తానన్న ఆయన.. ఇంకెప్పుడు చేస్తారు? అని ప్రశ్నించారు. శనివారం నారాయణపేట జిల్లాలోని మక్తల్, నర్వ మండలాల్లో ఆమె పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మక్తల్ లోని గువ్వలపల్లి, మంథన్​గోడ్, నర్వలోని పాతర్చేడులో షర్మిల మాట్లాడారు. ‘‘రైతులకు రూ.5 వేల రైతుబంధు ఇచ్చి రూ.30 వేల సబ్సిడీ పథకాలు బంద్ పెట్టారు. కేవలం రూ.5 వేలకే రైతులు కోటీశ్వరులు అయిపోతారా? రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో వడ్డీలు కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు” అని అన్నారు. కేసీఆర్ కు పాలన చేతకాదని, ఎప్పుడూ ఫాంహౌస్​లోనే ఉంటారని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా కేసీఆర్ నెరవేర్చలేదని ఫైర్ అయ్యారు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తి కాదని విమర్శించారు.

1,700 కి.మీ. పూర్తయిన పాదయాత్ర

షర్మిల పాదయాత్ర 1700 కిలోమీటర్లు పూర్తయింది. ఈ సందర్భంగా పాతర్చేడులో వైఎస్సార్ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించారు. 1,700 కిలోమీటర్లు నడిచింది తానే అయినా, నడిపించింది ప్రజల అభిమానమేనని అన్నారు.