ఆఫర్​లో గిఫ్ట్​ వచ్చిందని బంగారం ఎత్తుకెళ్లిండు

ఆఫర్​లో గిఫ్ట్​ వచ్చిందని బంగారం ఎత్తుకెళ్లిండు

 నిజామాబాద్ జిల్లా ఘన్​పూర్​లో మోసపోయిన మహిళ
బయటపడిన కొత్త రకం మోసం

డిచ్​పల్లి, వెలుగు : ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు సరికొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఫోన్​చేసి ఓటీపీలతో ఖాతాల్లో డబ్బులు ఖాళీ చేసిన క్రిమినల్స్​ ఇప్పుడు ఏకంగా ఇంటికి వచ్చి ఓటీపీలు అడిగే స్థాయికి ఎదిగారు. ఇలాంటి ఘటన సోమవారం నిజామాబాద్ జిల్లా డిచ్​పల్లి మండలం ఘన్​పూర్​లో జరిగింది. గ్రామానికి చెందిన  ​చైతన్య గృహిణి. ఆమె భర్త ఉపాధి కోసం గల్ఫ్​వెళ్లాడు. సోమవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తి బైక్ పై ఇంటికి వచ్చాడు. ఆఫర్​లో గిఫ్ట్ ​వచ్చిందని స్కూటీ, ఫ్రిడ్జ్, బంగారంలలో ఏదైనా ఒకటి సెలెక్ట్​ చేసుకోవాలని చైతన్యను నమ్మించాడు.

ఫోన్​కి ఓటీపీ వస్తుందని అది చెప్తే గిఫ్ట్ ​ఇచ్చి వెళ్తానని చెప్పాడు. ఆమె ఫోన్​లేదని చెప్పడంతో ష్యూరిటీగా ఆమె వద్ద ఏమైనా బంగారం రసీదులు ఉంటే ఇవ్వాలని కోరారు. రసీదులు కూడా లేవని చెప్పడంతో తనకు తెలిసిన గోల్డ్​షాప్​లో ఇప్పిస్తానని చెప్పాడు. నిజమేనని నమ్మిన ఆమె తులంన్నర ఉన్న రెండు ఉంగరాలు, కమ్మలు ఇచ్చి అతడితో బైక్​పై వెళ్లింది. మార్గమధ్యలో తన ఇంట్లోకి వెళ్లొస్తానని చెప్పిన సదరు వ్యక్తి బంగారంతో ఉడాయించాడు. మోసపోయానని గుర్తించిన మహిళ డిచ్​పల్లి పీఎస్​లో కంప్లయింట్​ ​చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.