ఎండపూట బయటకు రాకండి..హీట్ వేవ్స్ అలర్ట్ జారీ చేసిన హెల్త్ డైరెక్టరేట్

ఎండపూట బయటకు రాకండి..హీట్ వేవ్స్ అలర్ట్ జారీ చేసిన హెల్త్ డైరెక్టరేట్
  • హీట్ వేవ్స్ అలర్ట్ జారీ చేసిన హెల్త్ డైరెక్టరేట్
  • వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలె 
  • బయటకెళ్లాల్సి వస్తే.. నీడలో ఉండాలని సూచన 
  • జూన్ 4న కేరళలోకి నైరుతి 
  • ఆ తర్వాత వారానికి మన రాష్ట్రంలోకి 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్నందున బయటికి వెళ్లేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ మంగళవారం హీట్​వేవ్ అలర్ట్​ను జారీ చేసింది. మధ్యాహ్నం సమయంలో ఇంట్లోనే ఉండాలని సూచించింది. దూప కాకున్నా వీలైనంత ఎక్కువగా నీళ్లు తాగాలని, షర్బత్, మజ్జిగ, లస్సీ, పండ్ల రసాలను, సీజనల్ పండ్లను ఎక్కువగా తీసుకోవాలని తెలిపింది. తేలికపాటి బట్టలు వేసుకోవాలని, తలపై ఎండ తగలకుండా స్కార్ఫ్ లేదా క్యాప్​ను పెట్టుకోవాలని.. గొడుగును తీసుకెళ్లాలని సూచించింది. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వీలైనంత వరకు నీడలో ఉండాలని తెలిపింది. ఎండపూట ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలు, తలుపులు మూసి ఉంచాలని, రాత్రిపూట చలి గాలి వచ్చేలా కిటికీలు తెరవాలని పేర్కొంది. పార్క్ చేసిన కార్లు లేదా ఇతర వాహనాల్లో పిల్లలను వదిలేయొద్దని హెచ్చరించింది. ఒళ్లు వేడిగా ఉన్నా, చర్మం ఎరుపెక్కి పొడిబారినా, బాడీ టెంపరేచర్ ఎక్కువగా అనిపించినా, తలనొప్పి తీవ్రంగా ఉన్నా, తల తిరుగుతున్నట్టున్నా, వాంతులైతున్నా, గుండె వేగం పెరిగినా, ఊపిరి తీసుకోవడంలో తేడా అనిపించినా హాస్పిటల్​కు వెళ్లాలని హెల్త్ డైరెక్టరేట్ సూచించింది. ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, అంగన్​వాడీ సెంటర్ల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. హాస్పిటళ్లలో బెడ్లు, ఐవీ ఫ్లూయిడ్స్​నూ అందుబాటులో పెట్టినట్లు వివరించింది.   

ఈ సారి వారం ఆలస్యంగా నైరుతి  

నైరుతి రుతుపవనాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రానున్నాయి. జూన్ 4 నాటికి రుతు పవనాలు కేరళలోకి  ప్రవేశించే చాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 4 రోజులు అటుఇటుగా కేరళకు రుతుపవనాలు వస్తాయని మంగళవారం చెప్పింది. నిరుడు మే 29వ తేదీనే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ఈసారి వారం రోజులు ఆలస్యంగా రానున్నాయి. అయితే, తెలంగాణలోకి ఎప్పుడు వస్తాయన్నది తొందర్లో తెలుస్తుందని వాతావ రణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు.