వ్యాక్సిన్​ టూర్లు వద్దు.. సొంతదేశంలో తీసుకోవడం బెస్ట్​

వ్యాక్సిన్​ టూర్లు వద్దు.. సొంతదేశంలో తీసుకోవడం బెస్ట్​

న్యూఢిల్లీ: ఇప్పుడు ప్రపంచమంతటా కరోనా వ్యాక్సిన్​కు డిమాండ్​ ఉంది. ఇప్పటికీ కొన్ని దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో లేవు. కొన్ని వ్యాక్సిన్లు ఉన్నా, వాటి పనితీరుపై అనుమానాలు ఉన్నాయి. అమెరికా వంటి దేశాలు వాడే వ్యాక్సిన్లు బాగా పనిచేస్తాయని కొందరు నమ్ముతున్నారు. ఇలాంటి వారి కోసం వ్యాక్సిన్​ టూర్లను ట్రావెల్​ కంపెనీలు ఆఫర్​ చేస్తున్నాయి. అయితే, టీకాల కోసం విదేశాలకు వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని హెల్త్​ ఎక్స్​పర్టులు  అంటున్నారు.  అంతేకాదు ఇలాంటి టూర్లలో పైకి చెప్పని ఖర్చులు చాలా ఉంటాయని ఇండియా, థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌  ట్రావెల్ ఏజెంట్ అసోసియేషన్లు -హెచ్చరించాయి. ఈ రెండు దేశాల్లో చాలా మంది ఆపరేటర్లు వ్యాక్సిన్​ టూర్లను ఆఫర్​ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రయాణాలపై చాలా చోట్ల నిషేధం ఉన్నా,  టీకా టూర్ల ప్రకటనలు ఆగడం లేదు. అమెరికాలో వ్యాక్సిన్​ వేసుకోవచ్చని ఊరిస్తున్నారు.  

రిస్కు ఎక్కువే..

"అమెరికాకు వెళ్లడం చట్టవిరుద్ధం కాదు. అది మీ ఇష్టం. మా సూచన ఏంటంటే.. ఆపరేటర్​ను ఎంచుకునే ముందు.. అతని గత చరిత్ర చూడండి. నమ్మకస్తులైతేనే ముందడుగు వేయండి. అన్ని వివరాలూ తెలుసుకోండి. అక్కడికి వెళ్లాక ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఖర్చులు ఎవరు భరిస్తారు ? మీకు వ్యాక్సిన్​ కచ్చితంగా దొరుకుతుందన్న నమ్మకం ఏంటి ? సైడ్​ ఎఫెక్ట్స్​ వస్తే ఏం చేయాలి ?’’ అని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జ్యోతి మాయల్ ప్రశ్నించారు.  ముంబైకి చెందిన జెమ్ టూర్స్ & ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాక్సిన్​ టూర్లను ఆఫర్​ చేస్తోంది. న్యూయార్క్‌‌‌‌లో మూడు రోజుల బస కోసం ఐదు వేల మంది నుంచి డబ్బు తీసుకుంటోంది. రెండో డోస్​ టూర్​ కూడా నిర్వహించింది. ఒక్కోట్రిప్​కు దాదాపు రూ.1.5 లక్షలు వసూలు చేసింది. అగ్వానీ ట్రావెల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అమెరికాలో ఫైజర్-బయో ఎంటెక్ వ్యాక్సిన్‌‌‌‌ వేయించే టూర్​ను ఆఫర్​ చేసింది. ఒక్కొక్కరికి 6,100 డాలర్లు (దాదాపు రూ.4.5 లక్షలు) ఖర్చవుతుందని, న్యూయార్క్​లో 21 రోజులు ఉంచుతామని హామీ ఇచ్చింది. ఇండియాలోనే వ్యాక్సినేషన్​ మొదలుకావడంతో టూర్​ను రద్దు చేశామని కంపెనీ యజమాని ప్రదీప్ శర్మ చెప్పారు. దుబాయ్ ఆధారిత అరేబియా నైట్స్ టూర్స్ రష్యా టీకాల కోసం టూర్లు మొదలుపెట్టింది. ఒకరికి  1,780 డాలర్లు వసూలు చేస్తోంది. ఇండియన్లను రష్యా తన దేశంలోకి అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. రష్యా సరిహద్దులను మూసేస్తే ఎలా ? అన్న ప్రశ్నకు “ఆ విషయం మా చేతుల్లో లేదు” అని అరేబియా నైట్స్​ స్పష్టం చేసింది.  చాలా మంది అమెరికా టీకా కోసం అడుగుతున్నా, ఎంక్వైరీ చేస్తున్న వాళ్లలో 80 శాతం మందికి అమెరికా వీసా లేదని ఒక టూర్​ ఆపరేటర్​ చెప్పారు.  వీసా ఖర్చులు, విమాన టికెట్లు, భోజనం, క్వారంటైన్​ ఖర్చులు కస్టమరే పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు.  ప్రయాణికులు అనారోగ్యానికి గురైతే ఆపరేటర్లు కూడా బాధ్యత వహించరని థాయ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్​ ఫ్యూన్‌‌‌‌ఫిహాప్ తెలిపారు. ఇలాంటి ప్యాకేజీల వల్ల ప్రయాణికుడు చాలా రిస్కులను భరించాలని స్పష్టం చేశారు. ఫైజర్ , మోడెర్నా వ్యాక్సిన్లు మంచివని భావించడం వల్ల ఎక్కువ మంది అమెరికావైపు చూస్తున్నారు.  అయితే, ఇండియా ఈ నెల 31 వరకు ఇంటర్నేషనల్ విమానాలపై నిషేధం విధించింది.