జోగిపేటకు పూర్వ వైభవం తీసుకొస్తా : దామోదర రాజనర్సింహ

జోగిపేటకు పూర్వ వైభవం తీసుకొస్తా : దామోదర రాజనర్సింహ
  •     వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

జోగిపేట, వెలుగు :  జోగిపేట పట్టణానికి పూర్వ వైభవం తీసుకొస్తానని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హామీ ఇచ్చారు. శనివారం ఆందోల్, జోగిపేట మున్సిపల్​పరిధిలో పర్యటించారు. కులసంఘాలతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. హత్నూరా, దౌల్తాబాద్​, చిలప్​చెడ్ మండలాల నుంచి ప్రజలు జోగిపేటకు వచ్చేందుకు ఆందోల్, అజ్జమర్రి గ్రామాల మధ్య  రూ.80 కోట్లతో బ్రిడ్జి నిర్మిస్తామని ప్రకటించారు. ఆందోల్​శివారులోని 12 ఎకరాల్లో  నర్సింగ్​కాలేజ్, ​దాని పక్కనే 150  పడకలతో సూపర్​స్పెషాలిటి హాస్పిటల్​ నిర్మిస్తామని చెప్పారు.

సంగుపేట వద్ద హైవేను తాకుతూ అండర్​పాస్​ నుంచి అన్నాసాగర్​ వరకు సెంటర్​లైటింగ్​తో రోడ్డు విస్తరించి డివైడర్​ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఆందోల్ చెరువు కట్ట సుందరీకరణ పనులతోపాటు చెరువులో బోటింగ్​ ఏర్పాటు చేసి విహారకేంద్రంగా తీర్చిదిద్దుతాన్నారు.  ఆర్యవైశ్య సంఘం కోరిన మేరకు వాసవి ఫంక్షన్ హాల్​రిపేర్​కు రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. 

సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలి

సంగారెడ్డి టౌన్ :  జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద జిల్లా అభివృద్ధికి సహకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. శనివారం సంగారెడ్డి కలెక్టర్​ఆఫీస్​లో కలెక్టర్ వల్లూరు క్రాంతితో కలిసి సీఎస్ ఆర్​నిధుల సేకరణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎస్​ఆర్​నిధులను విద్యా,  వైద్య సదుపాయాల కోసం ఖర్చు చేస్తామన్నారు.

ఇప్పటివరకు పరిశ్రమలు సీఎస్​ఆర్​కింద ఇవ్వాల్సిన బకాయిలపై అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి,  పరిశ్రమల శాఖ జీఎం,  కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులు, ఇన్​స్పెక్టర్​ఆఫ్ ఫ్యాక్టరీస్, సీపీవో, వివిధ పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.