కోవిడ్ హాస్పిటల్‌గా నాచారం ఈఎస్ఐ హాస్పిటల్

కోవిడ్ హాస్పిటల్‌గా నాచారం ఈఎస్ఐ హాస్పిటల్
  • 350 బెడ్లతో రేపటి నుంచి అందుబాటులోకి
  • బెడ్లకు, ఆక్సిజన్‌కు కొరత ఉండొద్దని నిర్ణయం
  • ఎక్కడైనా ర్యాపిడ్ టెస్టు కోసం ఎక్కువ వసూల్ చేస్తే కఠిన చర్యలు
  • ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టడం కేంద్రానికి భారంగా మారింది
  • కరోనా కేసుల తీవ్రతపై రివ్యూ నిర్వహించిన మంత్రి ఈటల


కరోనాకు సంబంధించిన ప్రతి విషయంలో ఐఏఎస్‌ల బృందం ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ మానిటరింగ్ చేస్తున్నారని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆక్సిజన్‌తో పాటు, మాన్ పవర్, కిట్ల కొరత లేకుండా చూడాలని ఫార్మా కంపెనీలతో సీఎం స్వయంగా మాట్లాడారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత, ఆక్సిజన్ షార్టేజ్, బెడ్ల కొరతపై మంత్రి ఈటల రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్‌కే భవన్‌లో మీడియాతో మాట్లాడారు. 

‘ఇప్పటికే నాలుగు లక్షల రెమ్డిసివర్ ఇంజక్షన్లను కొనుగోలు చేశాం. ఆక్సిజన్ కొరత లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి యుద్ధ విమానాల ద్వారా 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ తెప్పిస్తున్నాం. ప్రభుత్వ ఆస్పత్రులు, మెడికల్ కాలేజీల్లో ఆక్సిజన్ కొరత లేదు. ఆయా జిల్లాల కలెక్టర్లు, డిఎంహేచ్ఓలు జిల్లా పరిధిలోని హాస్పిటల్స్‌లో ఆక్సిజన్ అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నారు. పీఎం కేర్ ఫండ్ నుంచి వచ్చిన ఐదు ఆక్సిజన్ మిషన్లను గాంధీ, టీమ్స్ ఆసుపత్రుల పాటు ఖమ్మం, కొత్తగూడెం, కరీంనగర్‌లలో ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో డిమాండ్‌కు తగ్గట్టుగా ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.  సి పాప్, బై పాప్, మానిటర్లు, వెంటిలేటర్స్ సీఎం ఆదేశాల మేరకు అన్ని హాస్పిటళ్లలో ఏర్పాటు చేయబోతున్నాం. నాచారంలో ఉన్న ఈఎస్ఐని కోవిడ్ హాస్పిటల్‌గా 350 బెడ్లతో రేపటి నుంచి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. నిమ్స్‌లో 200 బెడ్లను విఐపీల కోసం రెడీ చేశాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన పేషంట్స్ ఎక్కువగా ఉన్నారు. ఒకే పేషంట్ ఎక్కువ రోజులు హాస్పిటల్‌లో ఉండకుండా.. ఆరోగ్యం మెరుగుపడితే ఇంట్లో హోమ్ ఐసోలేషన్‌‌లో ఉండాలని సూచిస్తున్నాం. దీనివల్ల బెడ్ల కొరత ఉండదు. ర్యాపిడ్ టెస్టు కోసం 500 రూపాయలు తీసుకోవాలని నిర్దారించాము, కానీ 700 రూపాయలు  తీసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. కొన్ని హాస్పిటల్స్‌లో ఆక్సిజన్, ఇంజక్షన్‌ల కొరత ఉందంటూ పేషంట్లను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాకు పిర్యాదు అందింది. అలాంటి వారందరి మీద చర్యలు తీసుకుంటాం. బాధితుల పట్ల ప్రైవేట్ ఆస్పత్రులు ఉదాసినంగా వ్యవహరించాలి. బడ్జెట్‌లో రూ. 35 వేల కోట్లను వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన కేంద్రం.. మళ్ళీ వ్యాక్సిన్ కొనుక్కోవాలని రాష్ట్రాల మీద భారం వేయడం బాధాకరం. కేంద్రం ఇచ్చే ప్రతి పైసా ప్రజలదే. ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టడం కేంద్రానికి భారంగా మారింది. 18 ఏళ్ళు పైబడిన వారికి టీకా బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనంటున్న కేంద్రం మాటలు అర్థ రహితం’ అని మంత్రి ఈటల అన్నారు.