
హైదరాబాద్, వెలుగు: కులంతో జ్ఞానం రాదని, చదువుకునేవారిని కులాలతో విభజించొద్దని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ రవీంద్రభారతిలో మహాత్మ ఫూలే ఫౌండేషన్ ట్రస్ట్, ఎంబీసీ టైమ్స్ కలిసి సబ్బండ వర్ణాల టీచర్ల మహా సమ్మేళనం నిర్వహించాయి. అన్ని కులాల్లోని 100 మంది టీచర్లను సన్మానించారు. ఈ కార్యక్రమానికి ఈటల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పేదరికం శాపం కాకూడదని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవారికి మెరుగైన విద్య అందిస్తున్నామని చెప్పారు. గురుకుల స్కూళ్లు పెట్టి ఒక్కో స్టూడెంట్‌పై ఏటా రూ.1.2 లక్షలు ఖర్చు చేస్తున్నామన్నారు. పేద స్టూడెంట్లకు సన్న బియ్యంతో అన్నం పెడుతున్నామని చెప్పారు. బీసీలకు ప్రత్యేకంగా గురుకుల స్కూళ్లు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకు తల్లి, తండ్రి, గురువు అన్నీ టీచరేనన్నారు. కాన్వెంటులో చదివే వారికన్నా సర్కారు బడిలో చదివిన వారిలోనే మానవతా దృక్పథం ఎక్కువని ఈటల అన్నారు.