
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని జిల్లా హాస్పిటళ్లలో కరోనా వార్డులను ఏర్పాటు చేయాలని ఆఫీసర్లను హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ ఆదేశించారు. ఐసోలేషన్ సెంటర్లను మళ్లీ ఓపెన్ చేయాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో వారం రోజుల్లోనే ఈ సెంటర్లను అందుబాటులోకి తేవాలని సూచించారు. కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో హెల్త్ సెక్రటరీ, ఇతర ఆఫీసర్లతో శనివారం మంత్రి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఆఫీసర్లకు దిశానిర్దేశం చేశారు. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీటింగ్‌కు సంబంధించి పలు సూచనలు చేశారు. మంత్రి ఈటల మాట్లాడుతూ.. కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు నిర్లక్ష్యం చేయకుండా, వెంటనే టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. రోగం ముదిరిన తర్వాత దవాఖానకు వెళ్లినవాళ్ల విషయంలోనే ఇబ్బంది అవుతోందన్నారు. ముందే అలర్టయి ట్రీట్‌మెంట్ తీసుకునేవాళ్లు త్వరగానే కోలుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం తీసుకోవాల్సిన అన్ని చర్యలూ తీసుకుంటోందని, ప్రజలు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆఫీసర్లతో మీటింగ్ అనంతరం, జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లతో మంత్రి ఈటల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.జిల్లా హాస్పిటళ్ల సూపరింటెండెంట్లతో కలిసి పనిచేయాలని డీఎంహెచ్‌వోలకు సూచించారు. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని ఆదేశించారు. టెస్ట్ చేయించుకున్న వ్యక్తికి, రిజల్ట్ వీలైనంత త్వరగా ఆ వ్యక్తి మొబైల్‌కు ఎస్ఎంఎస్ను పంపించాలన్నారు. వ్యాక్సినేషన్‌లో వేగం పెంచాలని, అర్హులైనోళ్లందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలన్నారు.
లక్షణాలు ఉన్నోళ్లందరికీ ట్రీట్‌మెంట్
గతంలో కరోనా ట్రీట్‌మెంట్ అందించిన అన్ని దవాఖాన్లలో కరోనా వార్డులను మళ్లీ ప్రారంభించాలని, ప్రతి జిల్లా కేంద్రంలో కరోనా వార్డు ఉండాలని, మైల్డ్, మోడరేట్ సింప్టమ్స్ ఉంటే అక్కడే ట్రీట్‌మెంట్ అందించాలని ఈటల తేల్చిచెప్పారు. అన్ని దవాఖాన్లలో ఆక్సిజన్, మెడిసిన్ ఉంచాలని, డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు.
కొత్త యాప్
కరోనా పాజిటివ్ కాంటాక్ట్ వ్యక్తులను ట్రేస్ చేసేందుకు కొత్త యాప్‌ను తీసుకొస్తున్నట్టు మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఎవరికైనా పాజిటివ్ వస్తే, వెంటనే ఆ వ్యక్తి దగ్గర కాంటాక్ట్ వ్యక్తుల ఫోన్ నంబర్లు తీసుకుని వాళ్లకు ఎస్‌ఎంఎస్ ద్వారా అలర్ట్ పంపేలా ఈ యాప్‌ను రూపొందించినట్టు చెప్పారు. టెస్టు చేసుకోవాలని రిపీటెడ్ ఎస్‌ఎంఎస్‌లు యాప్ నుంచి వెళ్తాయన్నారు.
పేషెంట్ల తరలింపునకు 32 వెహికల్స్
కరోనా పేషంట్లను దవాఖాన్లకు తరలించేందుకు గ్రేటర్ హైదరాబాద్‌లో 32 అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామని ఈటల వెల్లడించారు. 108కి ఫోన్ చేస్తే, వెంటనే పేషెంట్‌ను దగ్గర్లోనే దవాఖానకు తరలించేలా ప్రణాళిక రూపొందించామన్నారు.
కాల్ సెంటర్ రీస్టార్ట్
పాజిటివ్ వచ్చి హోమ్ ఐసోలేషన్‌లో ఉండేవాళ్లకు మెడికల్ కిట్ కచ్చితంగా అందజేయాలని ఈటల ఆదేశించారు. వారికి రోజూ ఫోన్లు చేసి, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలని, అవసరమైన సూచనలు చేయాలని అన్నారు. ఇందుకోసం హైదరాబాద్ ఎస్‌ఆర్ నగర్‌లోని కాల్ సెంటర్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని ఆయన ఆదేశించారు.
ఆక్సిజన్ ట్యాంకులు పెట్టినం
కరోనా రోగులకు ఆక్సిజన్ కొరత ఎట్టి పరిస్థితుల్లో ఉండదని ఈటల స్పష్టం చేశారు. 22 దవాఖాన్లలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ఇతర దవాఖాన్లలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామని ఆయన వెల్లడించారు.
వారంలో ఐసోలేషన్ సెంటర్లు
హైదరాబాద్‌లోని నేచర్ క్యూర్ హాస్పిటల్, ఆయుర్వేద హాస్పిటల్, నిజామియా, ఫీవర్, చెస్ట్ హాస్పిటళ్లను క్వారంటైన్ సెంటర్లుగా మార్చాలని, వారం రోజుల్లో వీటిని అందుబాటులోకి తేవాలని ఆఫీసర్లను ఈటల ఆదేశించారు. జిల్లాల్లోనూ ఐసోలేషన్ సెంటర్లను మళ్లీ ఓపెన్ చేయాలన్నారు. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండే అవకాశం లేనోళ్లను, ఈ సెంటర్లలో అడ్మిట్ చేసుకుని అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఈ సెంటర్లలో 24 గంటలూ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.