మారేడ్​పల్లి కేజీబీవీ విద్యార్థినులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

మారేడ్​పల్లి కేజీబీవీ విద్యార్థినులను వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

సికింద్రాబాద్​, వెలుగు: సికింద్రాబాద్ పరిధి ​ఈస్ట్​ మారేడ్​పల్లిలోని కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కాలేజీలో గ్యాస్​ లీకేజీ ఘటనలో అస్వస్థతకు గురైన స్టూడెంట్లను అనారోగ్య సమస్య  వెంటాడుతూనే ఉంది. హాస్పిటల్​లో ట్రీట్ మెంట్ పొందిన విద్యార్థినులు డిశ్చార్జ్​ అయి ఇంటికి వెళ్లిన  రెండు, మూడు రోజుల్లో మళ్లీ అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో గత 42 రోజులుగా స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరో రెండు నెల్లలో ఇంటర్ ఎగ్జామ్స్    నేపథ్యంలో విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి కుదుట పడటకపోవడంతో  తల్లిదండ్రులు  ఆందోళనకు గురువుతున్నారు.  దీనిపై  మేనేజ్​మెంట్  పెద్దగా పట్టించుకోవడం లేదని వారు  ఆరోపిస్తున్నారు.  మూడ్రోజుల కిందట హాల్​టికెట్ల కోసం కాలేజీకి వచ్చిన విద్యార్థినులు ఒక్కసారిగా మళ్లీ అస్వస్థతకు గురికావడంతో మేనేజ్ మెంట్ వారిని ప్రైవేటు హాస్పిటల్​లో చేర్చించి అక్కడి నుంచి నిమ్స్​కు తరలించింది. మూడ్రోజుల కిందట నలుగురు విద్యార్థినులు నిమ్స్​లో చేరగా, ఆ సంఖ్య గురువారానికి ఎనిమిదికి చేరింది. అస్వస్థతకు గురవుతున్న స్టూడెంట్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం నిమ్స్​లో 8 మంది  ట్రీట్​మెంట్ తీసుకుంటుడగా..  వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని  తల్లిదండ్రులు  పేర్కొన్నారు. స్టూడెంట్లు పీల్చిన గ్యాస్​ఏంటో  తమకు తెలియదని  డాక్టర్లు చెబుతున్నారని.. పిల్లలు  భయంతో వణికిపోతున్నారని,  ఒక్కోసారి ఏదేదోమాట్లాడుతున్నారని, మానసిక స్థితి బాగోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలకు కౌన్సెలింగ్​  ఇప్పించాలని డాక్టర్లు చెపుతున్నారని తల్లిదండ్రులు వాపోయారు.

గొంతు నొప్పి , శ్వాస సమస్యలు..  

ఈ ఏడాది నవంబరు 18న కేజీబీవీలోని  ఇంటర్​ బ్లాక్​ కెమిస్ట్రీ ల్యాబ్​లో విద్యార్థినులు ప్రాక్టికల్స్​ చేస్తుండగా  విషవాయువులు వెలువడ్డాయి. దీంతో ల్యాబ్​లో ఉన్న  సుమారు 40 మంది స్టూడెంట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 10 మంది విద్యార్థినులు సృహ తప్పి పడిపోయారు.  వారిని పక్కనే ఉన్న గీతా నర్సింగ్​హోమ్​లో చేర్పించి ట్రీట్​మెంట్ అందించారు. తర్వాత అస్వస్థతకు గురైన అందరినీ మెరుగైన వైద్యం కోసం గాంధీ హాస్పిటల్​కు, అక్కడి నుంచి యశోదాకు తరలించారు. అక్కడ దాదాపు 10 రోజుల పాటు ట్రీట్​మెంట్ తీసుకున్న విద్యార్థినులు ఒక్కొక్కరుగా డిశ్చార్జ్ అవుతూ వచ్చారు. అయితే డిశ్చార్జ్​ అయి ఇంటికి వెళ్లిన రెండు, మూడ్రోజులకే  మళ్లీ  అస్వస్థతకు గురికావడంతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. గ్యాస్ లీకేజీతో అస్వస్థతకు గురైన విద్యార్థినులు ఎక్కువగా శ్వాస సంబంధ సమస్య, తలనొప్పి, కడుపునొప్పి, గొంతులో మంట, హైఫీవర్​తో బాధపడుతున్నారు. కొందరిలో హిమోగ్లోబిన్ శాతం పడిపోతోందని డాక్టర్లు చెబుతున్నారు. ‘ఉన్నట్టుండి వారికి శ్వాస సమస్య తలెత్తుతోంది.  ఇంజక్షన్ ఇవ్వగానే తగ్గిపోయి.. మళ్లీ గంట తర్వాత రిపీట్ అవుతోంది.  చాలా మందికి లంగ్స్, కిడ్నీలు ఇన్​ఫెక్షన్​ అయినట్టు తెలిసింది, అయితే డాక్టర్లు ఆ విషయాన్ని మాకు చెప్పట్లేదు. రిపోర్టులు అడిగితే లేవంటున్నారు’ అని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఘటనకు కాలేజీ ల్యాబ్​కు సంబంధం లేదని, కాలేజీ బయట చెత్త కుప్పలో బాటిల్​ పగిలి అందులో నుంచి విష వాయువులు వచ్చినట్టు మేనేజ్​మెంట్ దాటవేత సమాధానం చెబుతోందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.  అధికారులు పట్టించుకోవాలని కోరుతున్నారు.

ఎర్రగడ్డకు తీసుకుపోమంటున్నరు  

గ్యాస్​ లీక్​ ఘటనలో అస్వస్థతకు గురైన మా అక్క ఇంకా కోలుకోలేదు. మూడ్రోజుల కిందట హాల్​టికెట్​ కోసం కాలేజీకి వచ్చి అక్కడే పడిపోయింది. వెంటనే  గీతా నర్సింగ్ ​హోంలో చేర్పించి అక్కడి నుంచి నిమ్స్​కు పంపారు. ఇంకా పరిస్థితి  సీరియస్​గానే ఉంది. ఇంకా 8 మంది స్టూడెంట్లు నిమ్స్​లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు.  బాధ తట్టుకోలేక పిల్లలు అరుస్తుంటే ‘వారి మానసిక స్థితి బాగా లేదు ఎర్రగడ్డలోని ఆస్పత్రికి  తీసుకువెళ్లమని’ డాక్టర్లు చెబుతున్నారు.

- షేక్ మహబూబ్,  విద్యార్థిని 
షబానా సోదరుడు, మారేడ్ పల్లి

యాజమాన్యం ఒప్పుకుంటలే.. 

కాలేజీలో లీకైన గ్యాస్​ వల్లనే విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. దీనిని కాలేజీ యాజమాన్యం ఒప్పకుంటలే. ఈ గ్యాస్ లీక్​తో తమకు ఎలాంటి సంబంధం లేదంటు న్నారు. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. 42 రోజులు అయినా  పిల్లలు కోలుకుంటలేరు.  పోలీసులు ఇప్పటివరకు సమగ్ర విచారణ జరుపలేదు. అసలు గ్యాస్​ లీక్​ ఎలా అయింది? ఎక్కడ అయిందనే విషయాలను తేల్చాల్సిన పోలీసులు ఇంత వరకు స్పందించలేదు.

- జనార్దన్, విద్యార్థిని తండ్రి 

అసలు విషయాన్ని దాచిపెడుతున్నరు

కాలేజీలో లీకైన గ్యాస్​ చెత్త కుప్ప నుంచి రాలేదు. అది కాలేజీ ల్యాబ్​ నుంచే వెలువడి 40 మందిని  అనారోగ్యానికి గురిచేసింది. 42 రోజులు గడిచినా పరిస్థితి అలాగే ఉందంటే అస్వస్థతకు గురైన అమ్మాయిల ఆరోగ్యానికి భవిష్యత్​లో ప్రమాదకర పరిస్థితులే ఉంటాయి. లీకైంది ఏ గ్యాస్​ అనేది తెలియాలి. దానికి అనుగుణంగా విద్యార్థినులకు ట్రీట్​మెంట్​ చేయాలి.  కాలేజీ మేనేజ్ మెంట్ అసలు విషయాన్ని దాచిపెడుతోంది.         - -దిలారి లక్ష్మి,  ఆల్​ఇండియా హ్యూమన్ రైట్స్​ స్టేట్​ చీఫ్​ సెక్రటరీ