జ్వరాల బారిన కన్నేపల్లి

జ్వరాల బారిన కన్నేపల్లి

జయశంకర్‌‌ ‌‌భూపాలపల్లి, కాటారం, వెలుగుకాళేశ్వరం ప్రాజెక్టు ‌‌కోసం భూములిచ్చిన కన్నేపల్లి గ్రామం మంచం పట్టింది. ఊర్లోని ప్రతి ఇంట్లో పేషెంట్లు కనిపిస్తున్నారు. మొత్తం 132 కుటుంబాలుంటే వంద మందికిపైగా జ్వరాలతో బాధపడుతున్నారు. కెమికల్‌‌ ‌‌వినియోగం వల్ల తాగునీరు, పరిసరాలు కలుషితం అయ్యాయని.. దాంతో అనారోగ్యం పాలవుతున్నామని బాధితులు అంటున్నారు. హెల్త్​ డిపార్ట్​మెంట్​ అధికారులు గ్రామానికి వచ్చి టెస్టులు చేయాలని, ట్రీట్​మెంట్​ అందజేయాలని కోరుతున్నారు. గ్రామంలో వరుసగా జబ్బులు వస్తున్నాయని, కారణమేంటో గుర్తించి, శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

300 ఎకరాలు ఇచ్చారు

జయశంకర్  భూపాలపల్లి జిల్లాలోని పుణ్యక్షేత్రం కాళేశ్వరానికి రెండు కిలోమీటర్ల దూరంలో కన్నేపల్లి పంపు హౌస్  కోసం 300 ఎకరాల పంట భూములిచ్చిన ఊరు మేట్ పల్లి (కన్నేపల్లి). ఇక్కడ మొత్తం 132 కుటుంబాలు ఉన్నాయి. అందులో చాలా మంది ప్రాజెక్టు కింద భూములు కోల్పోయినవారే. వారి నుంచి తీసుకున్న భూముల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రూ.3 వేలతో భారీ పంపు‌‌హౌస్ కట్టింది. అయితే ఈ పంపుహౌస్​ ​ పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి గ్రామంలో ఏదో ఒక అనారోగ్యం వస్తోందని ఊరివాళ్లు చెప్తున్నారు. నెల రోజులుగా అయితే ఊర్లో చాలా మందికి జ్వరం వచ్చిందని, ఒళ్లంతా నొప్పులు, నీరసంతో ఇబ్బందిపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్రీట్​ మెంట్​ అందుతలేదు

గ్రామంలో జ్వర పీడితుల గురించి అధికారులకు కూడా తెలుసునని ఊరివాళ్లు చెప్తున్నారు. సహకార ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వెళ్లిన లీడర్లను నిలదీశామని తెలిపారు. దీంతో వారు ఆఫీసర్లతో మాట్లాడారని, సీఎం కేసీఆర్ పర్యటన ముగిసిన తెల్లవారే డీఎంఅండ్‌‌‌‌హెచ్‌‌‌‌వో ఊరికి వచ్చి పరిస్థితి గమనించి వెళ్లారని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కుబడిగా ముగ్గురు ఆశ వర్కర్లకు పారాసిటమాల్ టాబ్లెట్లు ఇచ్చి గ్రామంలో కూర్చోబెట్టారని.. ఊర్లో ఉన్న ఆర్‌‌‌‌ఎంపీ డాక్టర్‌‌‌‌తో ట్రీట్​ మెంట్​ చేయించుకున్నా జ్వరం తగ్గుతలేదని చెప్పారు. పెద్ద డాక్టర్లతో గ్రామంలో క్యాంపు పెట్టి ట్రీట్ మెంట్​ చేయాలని కోరుతున్నారు.

పంపుహౌస్ దగ్గరి నుంచి డ్రైనేజీ నీళ్లు!

పంపుహౌస్ లో పనిచేసే కార్మికులు, ఆఫీసర్ల కోసం ఏర్పాటు చేసిన వాష్ రూమ్ ల డ్రైనేజీ వాటర్ మొత్తం కన్నేపల్లి ఊరిలోకే వస్తుంది. పంపుహౌస్ వద్ద నిర్మిస్తు న్న కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పక్కన ఈ డ్రైనేజీ వాటర్ తో పెద్ద కుంట ఏర్పడింది. దానితో దోమలు తయారై ఊరంతా రోగాల బారిన పడుతోందని గ్రామస్తులు చెప్పారు. అలాగే ఇంటికి వచ్చే నల్లా నీళ్లు కూడా పసుపు కలర్ లో వస్తున్నాయని, చిన్న చిన్న పసుపు కలర్ ఉండలు కనబడుతూ దుర్వాసన వస్తున్నాయని తెలిపారు. కన్నేపల్లి పంపుహౌస్ కట్టేటప్పుడు రాళ్లు పగల గొట్టడానికి బాంబు బ్లాస్టింగ్స్​ చేశారని.. ఆ పొగకు, కెమికల్ వాసనకు ఊరంతా జ్వరాలు వచ్చి మంచాన పడ్డారని చెప్పారు. నెల రోజుల కింద పంపుల దగ్గర ఏవో కెమికల్స్​ పూసి నీళ్లు కారుడు ఆపారని, అలా కెమికల్స్​ వాడినప్పుడల్లా ఊర్లో జ్వరాలు వస్తున్నాయని పేర్కొన్నారు.