సీఎం స్వగ్రామం చింతమడక హెల్త్ ప్రొఫైల్ ఏమాయే?

సీఎం స్వగ్రామం చింతమడక హెల్త్ ప్రొఫైల్ ఏమాయే?

సిద్దిపేట, వెలుగు:  సీఎం స్వగ్రామం చింతమడక హెల్త్​ ప్రొఫైల్ ​రెండేళ్లవుతున్నా రెడీ కాలేదు. స్టేట్​హెల్త్ ప్రొఫైల్ తయారీకి ఇక్కడే నాంది పలుకుతున్నామని  కేసీఆర్ చెప్పినా నేటికీ అతీ గతీ లేదు. సీఎం పర్యటన తర్వాత నాడు హడావిడిగా హెల్త్​ క్యాంపు పెట్టి గ్రామస్తులందరికీ టెస్టులు చేసి వెళ్లిన డాక్టర్లు, ఆఫీసర్లు నేటికీ గ్రామం వైపు కన్నెత్తి చూడలేదు. టెస్టుల  రిపోర్టులు గానీ హెల్త్​ ప్రొఫైల్​గానీ చేతికి రాలేదు.  తాజాగా బుధవారం జరిగిన కేబినెట్​ మీటింగ్​లో మరోసారి స్టేట్​హెల్త్​ప్రొఫైల్​ప్రస్తావన వచ్చింది. త్వరలోనే స్టేట్​ప్రొఫైల్​తయారుచేస్తామని, పైలట్​ ప్రాజెక్టు కింద  మొదట ములుగు, సిరిసిల్ల జిల్లాలో చేపడుతామని నిర్ణయించడంతో రెండేళ్ల కిందటి చింతమడక హెల్త్​ప్రొఫైల్​మళ్లీ తెరపైకి వచ్చింది. 

8 రోజుల హెల్త్​ క్యాంప్​

2019 జులై 22న సీఎం కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరి హెల్త్ ఫైల్​తయారీకి ఆదేశించారు. ఇంగ్లాండ్, అమెరికా దేశాల తర్వాత మన రాష్ట్రంలోనే అదీ చింతమడకలోనే హెల్త్ ప్రొఫైల్ తయారీకి అడుగులు పడుతున్నాయని గొప్పగా చెప్పారు. కానీ రెండేళ్లు గడిచినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది.  సీఎం ఆదేశాలతో హైదరాబాద్​లోని యశోద ఆసుపత్రికి చెందిన 50 మంది సిబ్బందితోపాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆగస్టు 3న చింతమడక గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ప్రారంభించారు. ప్రతి ఇంట్లో అందరూ వైద్య పరీక్షలు చేయించుకునేలా చూసేందుకు 15 మంది వలంటీర్లను నియమించారు. రోజుకు రెండు వార్డుల చొప్పున ప్రతిరోజు 500 మందికి పరీక్షలు చేశారు. 8 రోజుల శిబిరంలో చింతమడక, మాచాపూర్, సీతారాంపల్లి గ్రామాలకు చెందిన 5,561 మందికి ఒక్కొక్కరికి 36 రకాల రక్త పరీక్షలతో పాటు బీపీ, ఈసీజీ టెస్టులు నిర్వహించారు. 

రెండేళ్లు కావస్తున్నా అందని రిపోర్టులు

చింతమడక హెల్త్ ప్రొఫైల్ కోసం వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత వారం రోజుల్లోనే విశ్లేషణ చేసి రిపోర్ట్ ల ప్రకారం ట్రీట్​మెంట్​ అందిస్తామని అన్నారు. అలాగే  గ్రామస్తుల హెల్త్ ప్రొఫైల్​ను ఒక చిప్ లో నిక్షిప్తం చేసి ఇస్తామని, అది చూస్తే ఒక్కొక్కరి హెల్త్​ కండీషన్​ తెలుస్తుందని, ఇది ఎమర్జెన్సీ టైంలో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.  కానీ రెండేళ్లు కావస్తున్నా  నేటికీ గ్రామస్థులకు రిపోర్టులు అందలేదు. ఈ హెల్త్​క్యాంపు సందర్భంగా 12 మంది గ్రామస్తులు దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు గుర్తించి పరీక్షల కోసం హైదరాబాద్​కు తీసుకువెళ్లారు. అక్కడ టెస్టుల అనంతరం మందులు అందజేసి  చేతులు దులుపుకొన్నారే తప్ప తర్వాత వాళ్ల పరిస్థితి గురించి ఆరా తీసిన వాళ్లు కరువయ్యారు. 

ఆఫీసర్లు సైలెంట్

చింతమడక హెల్త్ ప్రొఫైల్​పై అంతా సైలెంట్ అయ్యారు. మెడికల్ ​క్యాంపు నిర్వహించి  రెండేళ్లు కావస్తున్నా ఎలాంటి రిపోర్టులు రాని విషయాన్ని అంతర్గతంగా మాట్లాడుకుంటున్నారే తప్ప బయటికి చెప్పడం లేదు. అటు ఆఫీసర్లు, ఇటు గ్రామస్తులు ఏం చెబితే ఏమవుతుందోనని భయపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మండల స్థాయి అధికారులను హెల్త్ ప్రొఫైల్ గురించి అడిగితే ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. ప్రైవేటు ఆసుపత్రి వాళ్లే హెల్త్ ​క్యాంపు నిర్వహించారని, వాళ్లే రిపోర్టులు ఇస్తారని, తమకేం సంబంధం లేదని వైద్యాధికారులు అంటున్నారు. చింతమడకలో పరిస్థితి ఇట్ల ఉంటే సీఎం కేసీఆర్​ మాత్రం త్వరలోనే రాష్ట్రమంతా హెల్త్​ ప్రొఫైల్​ తయారు చేస్తామని చెబుతున్నారు.